Tuesday, November 30, 2010

లాబీయింగ్ రారాణి..నీరా!

నీరా పుట్టింది ఒక పంజాబీ కుటుంబంలో. ఆమె తండ్రి శర్మ కెన్యాలో విమాన విడి భాగాలు సరఫరా చేసే కంపెనీకి ఏజెంట్‌గా వ్యవహరించేవారు. దీని వల్ల ఆమెకు విమానయాన సంస్థలకు సంబంధించిన అంశాలపై చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. 1970లలో శర్మ కుటుంబం కెన్యా నుంచి లండన్‌కు తరలివెళ్లింది. దీనితో నీరా విద్యాభ్యాసమంతా లండన్‌లోనే జరిగింది. ఆమెకు ఇంగ్లండ్ పౌరసత్వం కూడా లభించింది. లండన్‌లోని హార్బర్‌డేషర్స్ అనే స్కూలులో చదువుకున్న నీరా- చిన్నప్పుడు చాలా చలాకీగా ఉండేది. హైస్కూలు పూర్తయిన తర్వాత నీరా వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. డిగ్రీ పూర్తయిన కొద్ది కాలానికి లండన్‌కు చెందిన జనక్ రాడియాతో ఆమెకు వివాహమైంది. ముగ్గురు మగ పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత జనక్-నీరాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనితో విడాకులు తీసుకొని నీరా 1995లో భారత్‌కు వచ్చేసింది.

ఒక్కో మెట్టు ఎక్కుతూ...
నీరా వచ్చేనాటికి మన దేశంలోని కంపెనీలకు మీడియా రిలేషన్స్ చూసేందుకు ప్రత్యేకమైన సంస్థలు ఉండేవి కావు. కంపెనీలలో ఉండే కొందరు మేనేజర్లకే ఈ బాధ్యతను అప్పగించేవారు. అయితే భవిష్యత్తులో పబ్లిక్ రిలేషన్ సంస్థలకు మంచి అవకాశాలు ఉంటాయని నీరా ముందే పసిగట్టింది. తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్న వైమానిక రంగం కూడా భారత్‌లో దిన దిన ప్రవర్థమానమవుతుందని భావించింది. ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ముందు వైమానిక రంగంలో లోతుపాతులు బాగా తెలియాలి కాబట్టి -సహారా ఎయిర్‌లైన్స్‌లో పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా చేరింది నీరా. కొద్దికాలం తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి- సింగపూర్ ఎయిర్‌లైన్స్, కేఎల్ఎం, యూకే ఎయిర్ వంటి విమానయాన సంస్థలకు భారత ప్రతినిధిగా వ్యవహరించటం మొదలుపెట్టింది. ఈ సంస్థలతో ఉన్న అనుబంధం, అనుభవంతో- 2000 సంవత్సరంలో క్రౌన్ ఎయిర్ అనే ప్రైవేట్ విమాన సంస్థను ప్రారంభించటానికి ప్రయత్నించింది.

వంద కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఈ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో నీరా వైష్ణవి కమ్యూనికేషన్స్‌ను స్థాపించింది. అప్పటి హర్యానా ముఖ్యమంత్రి రావు బీరేంద్రసింగ్ మనమడు ధీరజ్ సింగ్ కూడా ఆ సంస్థలో భాగస్వామి. అయితే విభేదాలు రావటంతో నీరా కుమారుడు కరణ్‌ను ధీరజ్‌సింగ్ కిడ్నాప్ చేశాడు. 2003లో ఈ సంఘటన ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సంఘటన వల్ల నీరాకు ఉన్నతస్థాయిలో ఉన్న సంబంధాలు తొలిసారి బయటకు తెలిసాయి. అంతే కాకుండా- రాజకీయంగా అనేక మంది నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ధీరజ్‌సింగ్ కిడ్నాప్ కేసులో శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ కేసులో ధీరజ్ తప్పించుకొని పోకుండా నీరా శిక్ష పడేదాకా పోరాడిందని సన్నిహితులు చెబుత ారు.

రాజకీయ నాయకులతో..
నీరా ఢిల్లీలో స్థిరపడిన తర్వాత ఆమెకు అనేక మంది రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎన్‌డీఏ హయాంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా వ్యవహరించిన అనంత్‌కుమార్‌కు నీరా సన్నిహితురాలు. ఎన్‌డీఏ హయాంలో ఆమెకు అనేకమంది రాజకీయ నాయకులతోను, జర్నలిస్టులతోను సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఛాతర్‌పూర్‌లో నీరా ఇచ్చే పార్టీలకు అనేక మంది నేతలు, జర్నలిస్టులు హాజరయ్యేవారని చెబుతారు. 2001లో వైష్ణవి కమ్యూనికేషన్స్‌కు టాటా సంస్థల కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వ్యవహారాలు చూసే కాంట్రాక్టు లభించింది. టాటా సన్స్‌లో ఉన్న మొత్తం 90 కంపెనీల మీడియా వ్యవహారాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత నీరా హవా మరింతగా పెరిగింది.

ప్రభుత్వాలు మారినా...
2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఓటమి పాలయింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మారిన సమీకరణాల నేపథ్యంలో నీరా కొత్త స్నేహితులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే- ఆమె యూపీఏలోని వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుంది. డీఎంకేలో కీలకమైన పాత్ర పోషించే మాజీ కేంద్ర మంత్రి రాజా కూడా ఆమెకు అదే సమయంలో పరిచయమయ్యారు. యూపీఏ సర్కారు అనుసరిస్తున్న టెలికం విధానాల ద్వారా తన క్లయింట్స్‌కు లాభం చేకూర్చటానికి నీరా ప్రయత్నాలు ప్రారంభించింది. టెలికం రంగంలో టాటాలకు ప్రత్యర్థి అయిన ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్‌కు వ్యతిరేకంగా నీరా చేసిన లాబియింగ్ ఫలించింది.

2007 నాటికి అంబానీ బ్రదర్స్ మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. టెలికం రంగంలో టాటాకు ప్రత్యర్థి అయిన అనీల్‌కు వ్యతిరేకంగా నీరా పావులు కదిపింది. శత్రువు శత్రువు మిత్రుడనే నానుడిని అనుసరించి - అనీల్‌కు వ్యతిరేకంగా ముకేష్, రతన్‌టాటాలను కలపటంలో నీరా విజయం సాధించింది. దీనికి ప్రతిఫలంగా- ముకేష్ అంబానీ పబ్లిక్ రిలేషన్స్ చూసే అవకాశం నీరాకు లభించిందని చెబుతారు. దీని కోసమే ఆమె వైష్ణవి కమ్యూనికేషన్స్‌కు సోదర సంస్థగా న్యూకామ్‌ను నెలకొల్పింది.

మన దేశంలో లాబీయింగ్ చేసే పురుషులు అనేక మంది కనిపిస్తారు. మహిళలు ఈ రంగంలో చక్రం తిప్పటం చాలా అరుదైన విషయం. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో నీరాకు శిక్షపడుతుందా? లేకపోతే తప్పించుకుంటుందా అనే విషయం కాలమే నిర్ణయించాలి.

No comments:

Post a Comment

Jai Ho .............