ఎందరో తబలా విద్వాంసులు తమ తమ బాణీల్లో అద్భుతంగా వాయిస్తారు కాని థిరక్వా శైలిలో ఒక ప్రత్యేకమెన పరిపూర్ణత, గాంభీర్యం, నిండుతనం ఉండేవి. దశాబ్దాలుగా, ఆరేడు తరాల సంగీతజ్ఞులతో తలపండిన అనుభవం, మారుతున్న అభిరుచులతో రాజీలేని శాస్ర్తీయ ధోరణి, శాశ్వతమెన విలువలని ప్రతిబింబించే సంగీత వైఖరి ఇలాంటి లక్షణాలన్నీ ఆ నాటి కచేరీలో కనిపించారు.
ఎందరో తబలా విద్వాంసులు తమ తమ బాణీల్లో అద్భుతంగా వాయిస్తారు కాని థిరక్వా శైలిలో ఒక ప్రత్యేకమెన పరిపూర్ణత, గాంభీర్యం, నిండుతనం ఉండేవి. దశాబ్దాలుగా, ఆరేడు తరాల సంగీతజ్ఞులతో తలపండిన అనుభవం, మారుతున్న అభిరుచులతో రాజీలేని శాస్ర్తీయ ధోరణి, శాశ్వతమెన విలువలని ప్రతిబింబించే సంగీత వైఖరి ఇలాంటి లక్షణాలన్నీ ఆ నాటి కచేరీలో కనిపించాయి. దశాబ్దాల క్రితమే కాలంచేసిన మహోన్నత గాయకు లెందరికో పక్క వాయిద్యం వాయించిన థిరక్వాను కళ్ళారా చూసి, ఆయన తబలా వినగలిగినందుకు ప్రేక్షకులందరూ థ్రిల్ అయారు. కచేరీ తరవాత ఆటోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యి చాలా వణికిందిగానీ తబలా వాయిస్తున్నప్పుడు మాత్రం ముసలితనం అడ్డురాలేదు.
బాల్యంలో...
చిన్నవయసులోనే అహ్మద్‌జాన్ శ్రద్ధగా సాధన చేసే వైఖరి, నైపుణ్యం కారణంగా అతను మునీర్‌ఖాన్‌కు ప్రియశిష్యుడై పోయాడు. అతని నైపుణ్యాన్ని గమనిస్తున్న మునీర్‌ఖాన్ తండ్రి కాలేఖాన్‌కు అతని వేళ్ళు తబలా మీద కథక్‌నాట్యం చేస్తున్నట్టుగా అనిపించాయి. ఆ విధంగా అతనికి థిరక్వా అనే పేరు వచ్చింది. థిరక్వాది ఫరూఖాబాద్ సంప్రదాయానికి చెందిన లాలియానా బాణీ. ఈ శైలిలో వాయించే ఇతర తబలా కళాకారుల్లో అమీర్‌హుసేన్, (బడే గులాం అలీ ఖాన్, విలాయత్‌ఖాన్ తదితరులకు పక్క వాయిద్యం వాయించిన) నిజాముద్దీన్, గులాం హుసేన్, షమ్సుద్దీన్, నిఖిల్‌ఘోష్, గులాం రసూల్, నాగేశ్కర్ మొదలైనవారున్నారు.16వ ఏట తొలి కచేరి
దీర్ఘాయుష్షుతో అనేక దశాబ్దాలు సంగీతం వినిపించిన థిరక్వా రెండు యుగాలకు వారధిగా నిలిచాడు. మొదట సంగీత పోషకులుగా ఉండిన రాజాలు,నవాబుల ఆదరాన్ని చవిచూసిన ఈ విద్వాంసుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్యయుగంలో ప్రభుత్వం ద్వారా రేడియోలోనూ, పెద్ద సిటీల్లో మధ్యతరగతి సంగీతప్రియులు టికెట్లు కొని హాజరయ్యే పబ్లిక్ సంగీత కచేరీల్లో లభించే విశేష ప్రజాదరణను కూడా పొందగలిగారు. ఈ మార్పు ఆయనకు ఏమాత్రమూ ఇబ్బంది కలిగించకపోగా దానివల్ల ఆయన సంగీతానికి మరింత విస్తృతమైన ఖ్యాతి లభించింది. గొప్ప సంగీత జ్ఞానమూ,చెక్కుచెదరని గాంభీర్యమూ ఆయనకు సంగీత వృత్తిలో పేరుతెచ్చాయి.
ఆయన ప్రధానంగా సోలో కచేరీలే చేసినప్పటికీ, పాతతరం విద్వాంసులు అనేకమందికి తబలా సహకారం అందించారు. వారిలో అల్లాబందే ఖాన్,రజబ్‌అలీఖాన్, అల్లాదియాఖాన్, వహీద్‌ఖాన్, అల్లాఉద్దీన్‌ఖాన్, భాస్కరబువా బఖలే, ఫయ్యాజ్‌ఖాన్, ముష్టాక్‌హుసేన్, హాఫిజ్‌అలీ ఖాన్ (నేటి సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీఖాన్ తండ్రి), అలీఅక్బర్‌ఖాన్, రవిశంకర్, బిస్మిల్లాఖాన్, బేగంఅఖ్తర్, డాగర్ తదితరులున్నారు. చెదరని ఆత్మవిశ్వాసంతో తనకన్నా జూనియర్ కళాకారులకు తబలా వాయించడానికి కూడా ఆయన వెనకాడలేదు. పైగా ‘నాకులేని సంకోచం మీకెందుకు?’ అని ఆర్గనైజర్లతో అనేవాడట. ఆయన కచేరీ విన్నాక ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు పాల్ఘాట్ మణి అయ్యర్ ఆయనను సరస్వతీ అవతారమని పొగిడాడు.
థిరక్వా చాలా సంవత్సరాలపాటు లక్నో రేడియోలో తబలా వినిపించాడు. అనేక కచేరీల్లోనూ, సమావేశాల్లోనూ, సంగీతసభల్లోనూ ఆయనకు అపారమైన ఆదరణ, గౌరవమూ, పద్మభూషణ్ వంటి సన్మానాలూ లభించాయి. 1974 లో చివరిసారి ఆయన రేడియో సంగీత సమ్మేళనంలో కచేరీ చేశారు. వృద్ధాప్యంలో మాట్లాడేటప్పుడు ఆయన గొంతు వణికినా తబలా బోల్‌లు వినిపించేటప్పుడు మాత్రం ఆయన తొట్రుపడేవాడుకారు. ఆయన శిష్యుల్లో లాల్జీ గోఖలే, ప్రేమ్‌వల్లభ్, గులాం అహ్మద్, ఛోటా గోఖలే, నిఖిల్‌ఘోష్, అహ్మద్ అలీఖాన్, రామ్‌కుమార్‌శర్మ మొదలెన పేరుపొందిన తబలా విద్వాంసులున్నారు. సరైన పద్ధతిలో ఎడతెగని సాధనతో, వ్యాయామమూ, పౌష్టిక ఆహారంతో శిష్యులకు శిక్షణ నిచ్చాడాయన.
థిరక్వా గతకాలపు అనుభవాలను యువతరానికి వినిపిస్తూ ఉండేవారట.
అందరిలోకీ ఆగ్రా శైలి గాయకుడెన ఉస్తాద్ ఫయ్యాజ్‌ఖాన్‌కు పక్కవాయిద్యం వాయించడం తనకు తృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. తాళంమీద గట్టి పట్టు ఉన్న ఆఫ్తాబే మూసికీ (సంగీత భాస్కరుడు) ఫయ్యాజ్‌ఖాన్‌కు కూడా థిరక్వా అంటే చాలా అభిమానం. కచేరీ మధ్యలో ఆయన వహ్వా...! థిరక్వా అనేవాడట. రజబ్‌అలీఖాన్ తన గానకచేరీల్లో పాడే వేగాన్ని పెంచేసి, తాను మాత్రం అలిసిపోకుండా తబలా వాయించేవారికి అలసట కలిగించి ఏడిపించేవారట. ఇది గమనించిన థిరక్వా అందుకు అనుగుణంగా తన తబలా లెక్కను మార్చేసి ఎంతసేపైనా వాయించడానికి సిద్ధపడేవారు. దీనికి రజబ్‌అలీ కోపగించక మెచ్చుకున్నారు. విమానం ఎక్కడానికి భయపడినందువల్లే విదేశాలకు ఎన్ని ఆహ్వానాలొచ్చినా వెళ్ళలేదనిచెప్పి థిరక్వా అందర్నీ నవ్వించేవారు.
98 ఏళ్ళు జీవించిన ఈ తబలా మాంత్రికుడు జనవరి 1976లో తాను నివసిస్తున్న బొంబాయినుంచి తన స్వస్థలమైన లక్నోకు వెళ్ళారు. తానెప్పటికీ లక్నోలోనే ఉంటాను అని మిత్రులకు మాట ఇచ్చినందువల్లనో ఏమో, మొహరం వెళ్ళిన కొద్ది రోజులకే లక్నోనుంచి బొంబాయికి రైలెక్కడానికి వెళుతూ రిక్షాలోనే ఆయన ప్రాణాలు వదిలారు. రాచరికపు దర్బారుల గౌరవాన్నీ, అసంఖ్యాకులైెన సామాన్య ప్రజల ఆదరాభిమానాలనీ కూడా చవిచూసిన ఆ మహావిద్వాంసుడి మరణంతో ఒక గొప్ప శకం ముగిసినట్టయింది.
క్యారికేచర్ : మూర్తిగారి మధు
No comments:
Post a Comment