ప్రపంచ నాయకత్వంలో సముచిత స్థానం దక్కాల్సిందే
భారత్‌కు శాశ్వత సభ్యత్వం గల భద్రతామండలి కోసం ఎదురుచూస్తున్నా
ప్రపంచ వేదికపైకి భారత్‌ను ఆహ్వానించటమే కాదు.. దానికి మద్దతు ఇస్తున్నాం
భారత్ తన మార్కెట్లను తెరవాలి..
పెట్టుబడులపై నిబంధనలను సరళీకరించాలి
అమెరికా కూడా హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతులపై నిబంధనలను సరళం చేస్తుంది
భావి తరాల వారికి సుసంపన్నమైన, సురక్షితమైన ప్రపంచం కోసం నేటి తరం ఉమ్మడిగా కృషిచేయాలి
అగ్రరాజ్యం అమెరికా ‘కొత్త ప్రపంచ శక్తి’ భారత్ అంటూ జై కొట్టింది.
అనతికాలంలోనే అనూహ్య విజయాలు సాధించిన భారత్‌కు ప్రపంచ నాయకత్వంలో సముచిత స్థానం దక్కాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నానని భారత పార్లమెంటులో ప్రకటించారు. కేవలం పరస్పర ప్రయోజనాల కోసమే కాకుండా ప్రపంచ ప్రయోజనాల కోసం భారత్, అమెరికాలు ఉమ్మడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మరింత సుసంపన్నం చేయటం, ప్రపంచ శాంతిభద్రతలను పరిరక్షించటం, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను పెంపొందించటం అనే మూడు రంగాల్లో అమెరికా-భారత్‌ల మధ్య సహకారం పెంపొందాలన్నారు. బర్మా వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అంశాలను భారత్ విస్మరిస్తోందని చురకలు కూడా వేశారు.
న్యూఢిల్లీ: ఎన్నో భిన్నత్వాలు, ప్రతికూలతలు గల భారత్.. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూనే, విమర్శకుల అంచనాలను తారుమారు చేస్తూ కేవలం కొద్ది దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చోదక శక్తిగా ఎదిగిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీర్తించారు. భారత సంస్కృతి విశిష్టతను, బలమైన ప్రజాస్వామ్యాన్ని కొనియాడారు. సోమవారం సాయంత్రం భారత పార్లమెంటులో ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలతో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒబామా ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి, వంద కోట్ల మందికి పైగా భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడేందుకు నాకు అందించిన ఈ గొప్ప గౌరవానికి కృతజ్ఞతలు. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యమైన అమెరికా నుంచి, అందులోని ముప్పై లక్షల మంది దేశభక్తి గల భారత సంతతి అమెరికన్ల నుంచి శుభాకాంక్షలను, స్నేహాన్ని తెచ్చాను. గత మూడు రోజులుగా నేను, నా భార్య మిషెల్‌ను.. భారతదేశం, భారత ప్రజలు ఆత్మీయంగా ఆదరించారు. అందుకు మా కృతజ్ఞతలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. బహుత్ ధన్యవాద్!
భారత్ అభివృద్ధి చెందిన దేశం...
ఆసియాలో కానీ, ప్రపంచంలో కానీ భారత్ కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. భారత్ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం. అమెరికా, భారత్‌ల మధ్య ఉమ్మడి ప్రయోజనాలు, విలువలతో కూడిన సంబంధం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యమవుతుందన్నది నా గట్టి విశ్వాసం. ఈ భాగస్వామ్యాన్ని నిర్మించటం కోసమే నేను వచ్చాను. అంతులేని ప్రేమ, శాంతి సందేశాలను అందంచిన మీ జాతిపిత మహాత్మాగాంధీ వంటి వారితో భారత్ మా ఆలోచనలను విశాలం చేయటమే కాదు, మా నైతిక దృష్టినీ విస్తరింప జేసింది. నా జీవితం మొత్తంలో నేను గాంధీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. అమెరికాకు, ప్రపంచానికి గాంధీ సందేశం లేకుంటే.. నేనీ రోజు మీ ముందు అమెరికా అధ్యక్షుడిగా నిల్చుని ఉండేవాడిని కాదేమో.
మనం అవిభాజ్యం భాగస్వాములం...
సన్నిహిత సంబంధాలు గల భవిష్యత్ ప్రపంచాన్ని అమెరికా కోరుతోంది. ఈ స్వప్నాన్ని సాకారం చేయటంలో భారత్ ఒక అవిభాజ్య భాగస్వామి అని నేను ఎందుకు విశ్వసిస్తున్నానో ఈ రోజు చెప్పదలచుకున్నాను. మన దేశాల మధ్య సంబంధం విశిష్టమైనది. ‘మేము ప్రజలం’ అన్న ఒకే విప్లవాత్మక పదాలతో ప్రారంభమయ్యే రాజ్యాంగాలు గల రెండు బలమైన ప్రజాస్వామ్యాలు మనవి. రెండు గొప్ప గణతంత్రాలు మనవి. రెండు స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక వ్యవస్థలు మనవి. ఈ కారణంగానే.. ఈ నాటి సవాళ్లను పరిష్కరించటంలో భారత్, అమెరికాలు అవిభాజ్య భాగస్వాములని నేను విశ్వసిస్తున్నా. ఒక ఎదుగుతున్న ప్రపంచ శక్తిగా భారత్‌ను అమెరికా ఆహ్వానించటమే కాదు, దానికి చాలా బలంగా మద్దతునిస్తున్నాం. ప్రపంచంలో భారత్ తనకు తగిన స్థలాన్ని పొందుతున్న వేళ.. మన రెండు దేశాల మధ్య సంబంధాలను రాబోయే శతాబ్దానికి ఒక నిర్ణయాత్మక భాగస్వామ్యంగా మలచే చారిత్రక అవకాశం మనకు ఉంది.
మూడు ముఖ్యమైన రంగాల్లో కలిసి పనిచేయటం ద్వారా దీనిని సాకారం చేయగలమన్నది నా విశ్వాసం. ప్రపంచ భాగస్వాములుగా మన రెండు దేశాల్లో సుసంపన్నతను పెంపొందించుకోగలం. ఉన్నత సాంకేతిక, ఉన్నత వేతనాలు గల భవిష్యత్ ఉద్యోగాలను మనం సృష్టించగలం. నా పర్యటనతో మన పౌర అణు ఒప్పందాన్ని అమలు చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం. రక్షణ, పౌర అంతరిక్ష రంగాల్లో ఉన్నత సాంకేతిక భాగస్వామ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి.. మా ‘ఎంటిటీ (నిషిద్ధ) జాబితా’ నుంచి భారత సంస్థలను తొలగించాం. అలాగే ఎగుమతులపై మా నియంత్రణలను సంస్కరించేందుకు కూడా కృషిచేస్తాం. భారత్, అమెరికా పరిశోధకులు, శాస్తవ్రేత్తల మధ్య సహకారం.. హరిత విప్లవానికి నాంది పలికింది. ఇప్పుడు రైతులను సాధికారం చేయటానికి సాంకేతికతను ఉపయోగించటంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ ఉత్పాదకత, పరిశోధనల్లో అమెరికాది అగ్రస్థానం. మనం ఉమ్మడిగా రెండో సతత హరిత విప్లవానికి నాంది పలకవచ్చు.
ప్రపంచ భద్రతలో భాగస్వామ్యం...
భారత్, అమెరికాలు ఆసియాలో భాగస్వాములు కాగలవు. రెండు ప్రపంచ శక్తులుగా అమెరికా, భారత్‌లు ప్రపంచ భద్రతలో భాగస్వామ్యం పంచుకోగలవు. ప్రత్యేకించి రానున్న రెండేళ్లలో భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్యదేశంగా పనిచేయనున్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంది. నిజానికి.. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, న్యాయబద్దమైన ఐక్యరాజ్యసమితి గల అంతర్జాతీయ క్రమాన్ని అమెరికా కోరుకుంటోంది. అందుకే.. రాబోయే సంవత్సరాల్లో భారత్ శాశ్వత సభ్యదేశంగా గల సంస్కరించిన భద్రతామండలిని నేను ఆకాంక్షిస్తున్నా. పెరిగిన శక్తితో బాధ్యత కూడా పెరుగుతుంది. శాంతిభద్రతలను పరిరక్షించటం, ప్రపంచ సహకారాన్ని పెంపొందించటం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లటం అన్న సిద్ధాంతాలను నెరవేర్చటం కోసం ఐక్యరాజ్య సమితి ఉంది. ఇవి అన్ని దేశాల, ప్రత్యేకించి 21వ శతాబ్దానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్న దేశాల బాధ్యతలు. అణ్వస్ర్తాల విస్తరణను అరికట్టటం కూడా అందులో ఒకటి.
ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడాలి...
ప్రపంచంలో రెండు అతిగొప్ప ప్రజాస్వామ్య దేశాలు.. ఇతరుల స్వాతంత్య్రం కోసం కూడా మనం నిలబడాలన్న విషయాన్ని ఎన్నడూ మరువకూడదు. బర్మా వంటి దేశాల్లో జరిగినట్లుగా.. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేసినప్పుడు.. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు మౌనంగా ఉండజాలవు. మానవహక్కులను నిర్దాక్షిణ్యంగా ఉల్లంఘిస్తున్నపుడు.. దానిని ఖండిం చాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిది. ప్రత్యేకించి అమెరికా, భారత్ వంటి అగ్ర దేశాలది. నిజాయితీగా చెప్పాలంటే.. భారత్ ఈ అంశాలను తరచుగా విస్మరించింది. తమ కోసం తాము మాట్లాడుకోలేని వారి తరఫున మాట్లాడటం.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదు. అది సార్వభౌమ దేశాల హక్కులను ఉల్లంఘించటం కాదు. అది మన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవటం. విశ్వజనీనమని మనం చెప్తున్న మానవ హక్కులకు అర్థాన్నివ్వటం.
మనం నిర్మించుకునేదే భవిష్యత్...
ఉమ్మడి సుసంపన్నతను పెంపొందించటం, శాంతిభద్రతలను పరిరక్షించటం, ప్రజాస్వామ్య పాలనను, మానవ హక్కులను బలోపేతం చేయటం అన్నవి నాయకత్వ బాధ్యతలు. ప్రపంచ భాగస్వాములుగా భారత్, అమెరికాలు 21వ శతాబ్దానికి అందించే నాయకత్వమిది. అన్నిటికీ మించి ఈ సంబంధం అధ్యక్షులు, ప్రధానమంత్రుల మధ్య ఉండేది కాదు. పార్లమెంటు మందిరాల్లో ఉండేది కాదు. మన ప్రజల మధ్య పెంపొందాల్సిన భాగస్వామ్యమిది. కాబట్టి భారత ప్రజలతో నేరుగా మాట్లాడి నా ప్రసంగాన్ని ముగించదలచుకున్నాను. ఇతర దేశాలకు శతాబ్దాలు పట్టిన అభివృద్ధిని, ప్రగతిని మీరు కేవలం కొన్ని దశాబ్దాల్లో సాధించారు. ఇప్పుడు మీరు ప్రపంచ దేశాల్లో ఒక న్యాయబద్ధమైన నాయకత్వ స్థానాన్ని అందుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు దీనిని ముందే ఊహించారు. మీ పిల్లలు, వారి పిల్లలు ఆ తర్వాత దీనిని తెలుసుకుంటారు. కానీ.. మీరు, ఈ తరం భారతీయులు ఈ క్షణాన్ని ఒడిసిపట్టుకోగలరు. మీరు కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్తుంటే.. అమెరికా కేవలం ఓ పక్క నుంచి ఉత్సాహపరచటానికి పరిమితం కాబోదు.. మేం మీతో ఉంటాం, మీతో భుజం భుజం కలిపి సాగుతాం. డాక్టర్ అంబేద్కర్ వంటి దళితుడు తనకు తానుగా ముందుకుసాగి భారతీయులందరి హక్కులనూ పరిరక్షించే రాజ్యాంగాన్ని లిఖించినట్లుగా.. ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన సామర్థ్యాన్ని సాకారం చేసుకోగలరని నమ్ముతాం. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. ప్రజలు ఒకరిలో మరొకరు తమను తాము చూసుకోగలరని, ఉమ్మడిగా పనిచేయగలరని, ఒక జాతిగా విజయం సాధించగలరన్నది భారత చరిత్ర. ఇది అమెరికా చరిత్ర. ఇది మన దేశాల మధ్య భాగస్వామ్యానికి స్ఫూర్తి కాగలదు. ఈ స్ఫూర్తితో మనం పనిచేస్తే.. నేటి మన తరం నిర్మించే మరింత సంపన్నమైన, మరింత భద్రమైన, మరింత ధర్మమైన ప్రపంచంలో భారత, అమెరికాల భవిష్యత్ తరాలు నివసిస్తాయి.
కృతజ్ఞతలు. జైహింద్!’’
No comments:
Post a Comment