Saturday, November 6, 2010

హలో.... ఇండియా * అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా

సతీసమేతుడై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మూడు రోజుల భారత పర్యటనకు ముంబయి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. పాక్‌ ప్రస్తావన లేకుండానే ఉగ్రవాదంపై కళ్ళురిమారు. 26/11 ఉగ్రవాద బాధితులకు నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శమని ప్రవచించారు. అమెరికా భారత్‌ పరస్పర సహకారంపై తమదైన శైలిలో చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పారు. ఉభయదేశాల మధ్య 44వేల కోట్లరూపాయలకు చేరిన వాణిజ్య బంధం మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. భారత్‌తో కుదిరిన వ్యాపారబంధంతో తమ దేశంలో 50 వేల ఉద్యోగాలకు కల్పిస్తామని అన్నారు.


obama3ముంబాయి: అమెరికా-భారత్‌ల మధ్య ప్రధాన లావాదేవీలు పది బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు ( దాదాపు రూ. 44,000 కోట్లు) చేరుకున్నాయని అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శనివారం ప్రకటించారు. అమెరికాలో 50 వేల ఉద్యోగాల్ని కల్పిస్తామన్నారు. రెండుదేశాల మధ్య సంబంధాలు 21వ శతాబ్దానికే ఆదర్శంగా నిలుస్తాయన్న విశ్వాసముందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. పరస్పర సహకారం కోసం వ్యాపార పరమైన ఆటంకాల్ని తగ్గించవలసిందిగా ఆయన భారత్‌ను కోరారు.

నంబర్‌ వన్‌ భాగస్వామి ఎందుకు కాలేదు?
‘భారతదేశం మాతో వ్యాపారరంగంలో నంబర్‌ వన్‌ భాగస్వామి ఎందుకు కాలేకపోతోందో తెలీడంలేదు. అందుకు ఏ కారణమూ లేదు. (ఇప్పుడు అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో ఇండియా 12వ స్థానంలో ఉంది. ఆ స్థానం మారడం లేదు), ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు 21వ శతాబ్దంలోనే ఆదర్శ భాగస్వామ్యానికి నిర్వచనంగా నిలుస్తాయన్న నమ్మకం నాకుంది’ అని బరాక్‌ ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి మూడు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన ఒబామా యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబిసి) సమావేశంలో ప్రసంగించారు. ‘నేను ఇక్కడికి రావడానికి కొద్దిరోజుల కిందట అనేక కీలక లావాదేవీలు జరిగాయి. ఇండియాకు డజన్ల కొద్దీ విమానాల్ని అమ్మేందుకు బోయింగ్‌ సంస్థ సంసిద్ధత తెలిపింది. జిఇ కంపెనీ వందలాది ఎలక్ట్రిక్‌ ఇంజన్లను అమ్ముతుంది. ఈ లావాదేవీల విలువ పది బిలియన్‌ డాలర్లు...అంటే రూ 44 వేల కోట్లు. అలాగే అమెరికాలో 50 వేలకు పైగా ఉద్యోగాల్ని కల్పిస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు.

రిలయెన్స్‌ పవర్‌ ప్రకటన
obama4యుఎస్‌ఐబిసిలో ఒబామా ప్రసంగానికి కాస్త ముందుగా రిలియన్స్‌ పవర్‌ ఒక ప్రకటన చేసింది. 2400 మెగావాట్ల ప్లాంట్లకోసం జిఇ నుంచి విద్యుత్‌ పరికరాల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నట్టు రిలయెన్స్‌ వెల్లడించింది. అలాగే బోయింగ్‌ సంస్థనుంచి 33 న్యూ జనరేషన్‌ 737 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటామని లో కాస్ట్‌ కారియర్‌ సై్పస్‌జెట్‌ ప్రకటించింది.

మరింతగా పెట్టుబడులు
ఈ రెండు ఒప్పందాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ ఒబామా - ‘ఇండియా సామర్థ్యాన్ని ఈ రెండు ఒప్పందాలూ చాటిచెబుతున్నాయి. భవిష్యత్తు మార్కెట్‌ ఇండియాదే. మార్కెట్‌ అస్థిరత, టారిఫ్‌ల వంటి అవరోధాలపట్ల జాగ్రత్త వహిస్తే అమెరికా తన పెట్టుబడులు పెంచేందుకు సిద్ధంగా ఉంది’ అని ఒబామా హామీ ఇచ్చారు. ఎగుమతులపై నిబంధనల్ని సడలిస్తే డిఆర్‌డిఓ, ఇస్రో వంటి భారతదేశ వ్యవస్థల ప్రవేశాన్ని సాంకేతికంగా తిరస్కరించడానికి తెరపడుతుందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

మహాత్ముడు ప్రపంచానికే హీరో
obama&gandhi శనివారం భారతదేశం చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తనకు ప్రేరణనిచ్చిన మహాత్మాగాంధీ నివాసాన్ని సందర్శించారు. ‘మహాత్ముడు ప్రపంచానికే హీరో’ అని జాతిపితను శ్లాఘించారు. ‘నాకు ఆశను, ప్రేరణను ఇచ్చిన మహాత్ముడి జీవితానికి ప్రతీకలుగా ఉన్న వాటిని దర్శించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మహాత్ముడు భారతదేశానికి మాత్రమే జాతిపిత కాదు, ప్రపంచానికే హీరో’ అని ఒబామా మణిభవన్‌లో ఒక కప్‌ బోర్డుకు వేలాడదీసిన సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆ వాక్యాలు రాస్తున్నప్పుడు ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. తన హీరో మహాత్ముడి నివాసానికి ఒబామా తన సతీమణి మిచెల్లీతో కలిసి వెళ్లారు. దక్షిణ ముంబాయిలో లాబర్నం రోడ్‌లో ఉన్న ఆ రెండంతస్తుల ఆ పురాతన భవనంలో అమెరికా అధ్యక్షుడు 45 నిముషాలు గడిపారు. ఇల్లంతా కలియతిరిగి చూశారు.

మహాత్ముడు బొంబాయి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు. మహాత్ముడి స్మారకచిహ్నాన్ని చూసిన అనుభూతిని తను ఎప్పటికీ మనసులో పదిలపరుచుకుంటానని ఒబామా భార్య మిచెల్లీ చెప్పారు. ఈ పర్యటనను తను ఒక అమూల్యమైన నిధిగా భావిస్తున్నానని అన్నారు. ‘గాంధీజీ జీవితం, బోధనల గురించి ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలకు చెప్పాలి’ అని మిచెల్లీ సందర్శకుల పుస్తకంలో రాశారు. మణిభవన్‌ను ఇప్పుడు గాంధీ మ్యూజియంగా మార్చారు.

3 రోజుల పర్యటన 18 ప్రకటనలు
obama5ముంబాయి: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శనివారం సతీసమేతంగా భారతదేశం చేరుకున్నారు. ఆయన ఇక్కడ మూడు రోజులు పర్యటిస్తారు. ఆయన పర్యటన సందర్భంగా ఆర్థికరంగం, భద్రత, రాజకీయ రంగాలవంటి విస్తృతాంశాలపై 18 ప్రకటనలు వెలువడవచ్చని భావిస్తున్నారు. శాంతియుత, సైనిక ప్రయోజనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతులపై ఆంక్షల్ని సడలించడం వంటి అంశాలు ఆ 18 ప్రకటనల్లో చోటుచేసుకోవచ్చు.ఇంతవరకు భారతదేశాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుల్లో ఒబామా ఆరో వ్యక్తి. గత పదేళ్లలో ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షుల్లో ఈయన మూడోవారు.

శనివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 50 నిముషాలకు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ అమెరికా వైమానిక దళం విమానం నుంచి భారతభూమిపై కాలు మోపారు. ఆయన వెంట మంత్రివర్గ సహచరులు, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ ( ఎన్‌ఎస్‌ఏ) టాం డోనిలన్‌, 200 మంది అమెరికా వ్యాపారవేత్తలు వచ్చారు. అమెరికా అధ్యక్షుడి వెంట వివిధ రంగాలకు చెందినవారు ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే మొదటిసారి.

సాదర స్వాగతం
obama1మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, భారత్‌లో అమెరికా రాయబారి టిమోతీ రోమర్‌ , అమెరికాలో భారత రాయబారి మీరా శంకర్‌ ఒబామా దంపతులకు సాదరపూర్వకంగా స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమాలు, అభినందనలు పూర్తయిన తర్వాత ఒబామా దంపతులు తమకోసం సిద్ధంగా ఉన్న అమెరికన్‌ మెరైన్‌ వైపు నడిచి వెళ్లారు. అక్కడికి వచ్చిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ ఒబామా పలకరింపుగా చేయి ఊపారు. ‘భారతదేశం సంపూర్ణ అభివృద్ధిని అధ్యక్షుడు కోరుకుంటున్నారు. ఇండియాతో సాధ్యమైనంత బలమైన, విస్తృతమైన సంబంధాల్ని ఏర్పరచుకోవడం మా ఆసియా విధానాల్లో ముఖ్యాంశం’ అని నేషనల్‌ సెక్యూరిటీ ఆడె్వైజర్‌ డోనిలన్‌ తెలిపారు. ‘వివిధరంగాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే కాక, విశ్వసనీయతను చాటే దాదాపు 18 ప్రకటనలు ఈ సందర్భంగా వెలువడతాయి’ అని డోనిలన్‌ చెప్పారు.

సంబంధాలు మెరుగైనాయి
ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంతో అమెరికా సంబంధాలు నాటకీయంగా మెరుగయ్యాయని అమెరికా ఉప విదేశాంగ మంత్రి విలియం బర్న్‌‌స చెప్పారు. 2008 నుంచి ఇండియాతో 400 కోట్ల డాలర్ల విలువైన రక్షణపరమైన అమ్మకాలు జరిగాయని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ అభివృద్ధికి ఇండియా 130 కోట్ల డాలర్ల సాయం అందించడాన్ని ఆయన ప్రశంసించారు. ‘భారత్‌ పాకిస్తాన్‌లు వివిధ అంశాలపై చర్చించుకోవాలని మేం పదేపదే కోరుకుంటున్నామన్నారు.

వీధి బాలలతో మిచెల్లీ ఆటాపాటా
obama2ముంబాయి: ఓవైపు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో వ్యాపార వ్యవహారాల గురించి సీరియస్‌గా చర్చిస్తుంటే, మరోవైపు ఆయన భార్య మిచెల్లీ ముంబాయి విశ్వవిద్యాలయం లైబ్రరీ వద్ద వీధి బాలలు, అనాథలతో మాట్లాడారు. ఆమిర్‌ఖాన్‌ సినిమా ‘రంగ్‌ దే బసంతి’లో హిట్‌ సాంగ్స్‌ బాణీలకు వారితో కలిసి నాట్యం చేశారు. మిచెల్లీ వారితో అరగంటసేపు ఆటపాటలతో గడిపారు. వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఉత్సాహపరిచారు. అమెరికా అధ్యక్షుడి భారత్‌ పర్యటన సందర్భంగా శనివారం సాయంకాలం ముంబాయిలో కనిపించిన కమనీయ దృశ్యం ఇది. ‘నాకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. మీరు అదృష్టవంతులు. నాకూ ఇద్దరు పిల్లలున్నారు.

కష్టపడి పనిచేయడం, చదువుకోవడం, ధైర్యంగా ఉండడం జీవితంలో చాలా ముఖ్యం. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. అమెరికాకు ప్రథమ మహిళ అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు.కానీ నాకా అవకాశం వచ్చింది. అది చదువు వల్లే వచ్చింది. చదువుకుంటే మీరూ జీవితంలో విజయం సాధించగలరు’ మిచెల్లీ ఆ వీధి బాలలకు చెప్పారు. ఒక ఎన్‌జిఓ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో వైవిధ్యభరితంగా సాగింది.
ఒబామా.. వ్యాపార పర్యటన షురూ
obma-b అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మూ డు రోజుల పర్యటన నిమిత్తం శనివారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి చేరుకున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన 10 బిలయన్‌ డాలర్లు (రూ.44,000) కోట్లు ఆర్డర్లు దక్కించుకున్నారు. ప్రధానంగా విమానయాన, విద్యుత్‌తో పాటు ఇతర రంగాలకు చెందిన ఆర్డర్లు కుప్ప లు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఈ ఒప్పందాలతో ఒబామా అమెరికాలో 50,000 ఉద్యోగాలు సృష్టించుకోవచ్చు. అయితే భారత్‌ నుంచి ఎగుమతలు తగ్గించుకొని, అమె రికా నుంచి ఎగుమతలు రెండింతలు చేసుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రెండు దేశాల్లో కొత్తగా ఉద్యోగాలు సృష్టించుకోవచ్చునని ఆయన అన్నారు. భారత్‌ అమెరికాతో కలిసి భాగస్వామ్యం ఎందుకు కాకూ డదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్‌ వ్యాపార భాగస్వామిగా 12వ స్థానంలో ఉందన్నారు.

అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒబామాకు ఎదురుగాలి వీచింది. వృద్ధి రేటు కుంటుపడింది. నిరుద్యోగం రేటు పెరిగిపోయింది. దీంతో అమెరికాలో తగ్గిన తన పలుకు బడిని పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అమెరికన్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని అన్నారు.

ఆయన భారత్‌ గడ్డపై కాలు మోపగానే ఆశ్చర్యకరంగా పలు ఒప్పందాలు జరిగిపోయాయి. వాటిలో స్పయిస్‌జెట్‌ చౌక రకం విమానయానసంస్థ బోయింగ్‌తో కమర్షియల్‌ విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. జనరల్‌ ఎలక్ట్రిక్‌తో అడ్వాన్స్‌ జెట్‌ ఇంజన్‌ ఒప్పందం జరిగిపో యాయి. బోయింగ్‌ డజన్ల కొద్ది విమానాలు విక్రయి స్తుంది. జీఈ 100 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్‌ ఇంజన్లు అందజేస్తుందని అన్నారు. ఆయన రాకముందే సుమారు 10 బిలియన్‌ డాలర్లు (రూ.44,000) కోట్ల ఒప్పందాలు జరిగిపోయాయి.
అమెరికా భారత్‌ బిజినెస్‌ కౌన్సిల్‌లో మాట్లాడుతూ ఒబామా అమెరికాలో ఎగుమతుల్లో భారత్‌ వాటా కేవంల 2 శాతమేనని అన్నారు.

ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఒబామా అన్నారు. ఎగుమతుల నిబంధనలు సరళీకరించి టెక్నాలజీ రంగాల్లో కూడా పరస్పరం సహకరించు కోవాలని ఉదాహరణకు డీఆర్‌డీఓ, ఇస్రోకు కావాల్సిన సాంకేతికపరంగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆయన చెప్పారు. భారత్‌ - అమెరికా వాణిజ్యం 2009-10 ఆర్థిక సంవత్సరంలో 36.5 బిలియన్‌ డాలర్లని, ఇరు దేశాలు ప్రస్తుతం ఉన్న వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో రెండింతలు చేయాలని ఒబామా అన్నారు. భారత్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 8 శాతం అమెరికా నుంచి పొందుతుందని, 21వ శతాబ్దంలో భారత్‌ తమ భాగస్వామి అన్నారు. వ్యవసాయ రంగంలో అమెరికా భారత్‌కు ఎంతో సహకరించిందని, అలాగే భారత్‌ కూడా అమెరికాకు పలు రంగాల్లో సహకరించిందన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌ అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతుందని భారత్‌ గత రెండు దశాబ్దాల కాలంలో ఈ పురోగతిని సాధించిందని ఆయన ప్రశంసించారు. లైనెన్స్‌ రాజ్‌కు స్వస్తి పలికి, బహిరంగ మార్కెట్‌ విధానాన్ని భారత్‌ తెరలేపిందన్నారు.

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్‌లో మధ్యతరగతి ఉందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్‌ అమెరికాలో మరింత మెరుగైన వాణిజ్యం చేస్తుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే భారత్‌ తమ వాణిజ్య భాగస్వామి అవుతుందని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Jai Ho .............