Wednesday, November 3, 2010

మంచి స్నేహితులు దేవుడిచ్చిన వరాలు. * జీవితంలో ప్రతి మలుపులోనూ స్నేహితుల పాత్ర

ఓ పన్నెండుమంది కలిస్తే 'స్పెషల్ ఫ్రెండ్'

జీఎస్ఎస్ సంతోష్‌కుమార్‌కు చక్కటి స్నేహితులున్నారు. సినిమాలంటే అంతులేని ఆసక్తి ఉంది. పదో తరగతి నుంచే సినిమాలను శ్రద్ధగా చూడటం, క్షుణ్ణంగా విశ్లేషించడం అలవాటయింది. కొన్ని చిన్నాచితకావాటికి స్క్రీన్‌ప్లేలు రాసి, మరికొన్ని లఘు చిత్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ చాలుకదా, తానూ ఓ సినిమా తియ్యాలన్న కోరిక పుట్టడానికి. "మంచి స్నేహితులు దేవుడిచ్చిన వరాలు.

వాళ్లు మన కులం మతం కాకపోవచ్చు. కుటుంబసభ్యులసలే కాదు. కానీ అందరికన్నా మిన్నగా కష్టాలొచ్చినప్పుడు ఆదుకుంటారు, కన్నీళ్లను పంచుకుంటారు. ఆనందాన్ని రెట్టింపుచేస్తారు. విజయాలకు మురిసిపోతారు. జీవితంలో ప్రతి మలుపులోనూ స్నేహితుల పాత్ర అమోఘమైనది. అలాంటి స్నేహమే కథాంశంగా పూర్తి స్థాయి చిత్రాన్నెందుకు తియ్యకూడదు'' అనుకున్నాడు సంతోష్. అదీ ప్రారంభం.

మిత్రులే అన్నీ..
సినిమా విషయాల్లో తనకన్నా అనుభవం ఉన్న క్లాస్‌మేట్ హరిశంకర్‌తో కలిసి కథ, స్క్రీన్‌ప్లే పక్కాగా రాసుకున్నాడు సంతోష్. తాను చదువుతున్న అనిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించి కథలోని పాత్రలకు సరిపోయే విద్యార్థులను ఎంచుకున్నాడు. ఈ ప్రయత్నంలో తన కజిన్లు స్వాగత్, కార్తీక్ కలిసొచ్చారు. స్వాగత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తే, కార్తీక్ మార్కెటింగ్ చూసుకున్నాడు. మరో పదిమంది స్నేహితులు తలో పనీ అందుకున్నారు. సతీశ్ ఎడిటింగ్ చేస్తే శశికాంత్, ప్రదీప్, కిరణ్, చైతన్య ప్రొడక్షన్ అసోసియేట్లుగా పనిచేశారు. శ్రీవల్లి, చాందినీ, నవీన్ డైలాగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తే, ధీరజ్ ప్రోమో పాటగాడిగా గొంతు కలిపాడు.

ఇంజినీరింగ్ చివరి సంవత్సరం ప్రాజెక్టు వర్క్‌కిచ్చే సమయాన్ని ఉపయోగించుకున్నారు అందరూ. అంతా బానే ఉంది, మరి సినిమా తియ్యడానికి డబ్బు? తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి తలాకొంత తెచ్చుకున్నారు. అలా రెండున్నర నెలల కాలం, లక్ష రూపాయల డబ్బూ ఖర్చయితే తయారైంది 'స్పెషల్ ఫ్రెండ్'. కథేమిటీ అంటే - అస్ట్రానమర్ కావాలని తపించిన బాల్యస్నేహితుడు ఆకాశ్‌ను కలవాలని ఎన్నో ఏళ్ల తర్వాత నగరానికి వస్తాడు దీపక్. అతణ్ని కలవడానికే ఇష్టపడని ఆకాశ్ ఇక స్నేహం ఏం చేస్తాడు? మిత్రుడికి ఉన్న దృష్టిలోపాన్ని సవరించడానికి, మళ్లీ తమ స్నేహాన్ని చిగురింపజెయ్యడానికి దీపక్ చేసిన ప్రయత్నాలే 'స్పెషల్ ఫ్రెండ్' సినిమా సారాంశం.

అందరికీ నచ్చుతుంది..
పూర్తిగా విద్యార్థులే నిర్మించిన మొదటి ఫీచర్ ఫిల్మ్ 'సిలికాన్ జంగిల్'. నాలుగేళ్ల క్రితం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రూపొందిన ఆ సినిమా కొన్ని నగరాల్లో విడుదలయి యువ ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. తమ సినిమాను కూడా అలా విడుదల చేసి ఎక్కువమంది ప్రేక్షకులకు దగ్గరవాలని విశాఖ విద్యార్థుల ఆలోచన. ప్రస్తుతానికి అందరూ చదువైపోయి ఉద్యోగాల్లో చేరడంతో కాస్త వెసులుబాటు చిక్కింది.

అయినా దేశవ్యాప్తంగా విడుదల చెయ్యడం తమ శక్తికి మించినదని తెలుసు వాళ్లకు. అందుకే ఇప్పుడు ప్రివ్యూ చూపించి స్పాన్సర్లను వెతికే పనిలో పడ్డారు. "సినిమా తీస్తున్నప్పుడు మాలో ఎవ్వరూ ఇదే చెయ్యాలి అని గిరి గీసుక్కూచోలేదు. మేమే లైట్ బోయిస్, మేమే యాక్టర్స్, మేమే డైరెక్టర్స్..'' అంటూ నవ్విన స్వాగత్ "మా సినిమా విద్యార్థుల భావోద్వేగాలకు అద్దం పడుతుంది. అందుకే వాళ్లకు బాగా నచ్చుతుంది. కనీసం కొన్ని ముఖ్య పట్టణాల్లో విడుదల చెయ్యాలని మా ఆలోచన'' అన్నాడు.

వారే పునాదిరాళ్లు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన సంతోష్‌ను కదిలిస్తే 'ఎన్నో పెద్ద భవనాలు నిర్మాణంలో ఉన్నప్పుడు చూడండి. భూమిని బాగుచెయ్యడం, పునాదులు తవ్వడం, స్తంభాలు పొయ్యడం వంటి పనులకు ఎక్కువ కాలం పడుతుంది. ఆ సమయంలో స్థలం చుట్టూ ప్లాస్టిక్ కవర్లు కట్టేస్తారు కనుక పునాదుల పని ఎంత జాగ్రత్తగా నడుస్తుందో గమనించే అవకాశం ఎవరికీ రాదు. ఒకసారి పునాది వేస్తే, ఆపై భవన నిర్మాణం శరవేగంతో పూర్తయిపోతుంది.

దారిన పోయేవారు పై అంతస్తుల పని ఎలా నడుస్తోందో చూడగలుగుతారు. సినిమా కూడా అచ్చం ఇలాంటిదే. ప్రేక్షకులు తెరపైన కనిపించే నటీనటులను, అందమైన దృశ్యాలను మాత్రమే చూస్తారు. హృద్యమైన సంగీతాన్ని వింటారు. అది పూర్తయిన భవనాన్ని చూడటం వంటి దే. అసలైన పునాది పని చేసేది టెక్నీషియన్స్. సినిమాకు సంబంధించిన సవాలక్ష పనులను సవ్యంగా చెయ్యడం, ఎంతోమంది కలిసి పనిచేసేలా చూడటం అన్నది కష్టం. ఆ శ్రమలో పాలుపంచుకున్న నా మిత్రులే నా బలం. అసలైన ఆర్కిటెక్టులు వాళ్లే..'' అన్న మాటల్లోనే సంతోష్ పరిణతి అర్థమవుతోంది. అంత అవగాహన ఉంటే ఇక సాధించలేనిది ఏముంటుంది?
- అరుణ పప్పు

No comments:

Post a Comment

Jai Ho .............