కేరళకు చెందిన జె. గోపీకృష్ణన్ 'ది పయనీర్' పత్రికకు తిరువనంతపురంలో విలేకరిగా పని చేసేవాడు. అయితే ఆ పత్రిక కొచ్చి ఎడిషన్ 2007లో మూసివేయడంతో ఆయన ఉద్యోగం పోయింది. అయినా గోపీకృష్ణన్ ఆ పత్రికని విడిచిపెట్టలేదు. ఢిల్లీలో ఉన్న ఆ పత్రిక ప్రధాన కార్యాలయానికి వెళ్లి తనకి ఉద్యోగం ఇవ్వమని అభ్యర్థించాడు. ఎక్కడో కేరళలో స్ట్రింగర్‌గా పని చేసిన ఆయనకి ఢిల్లీలో ఏం రాజకీయ సంబంధాలు ఉంటాయి, ఏ విధంగా వార్తలు రాబట్టగలడు అనుకుని ఆ పత్రిక ఎడిటర్ గోపీకి ఉద్యోగం ఇవ్వడానికి సంశయించాడు. సరే ఎలాగూ ఢిల్లీ దాకా వచ్చాడు కాబట్టి మూడు నెలలపాటు ఇంటర్న్‌షిప్ ఇస్తూ... అది పూర్తయిన తర్వాత పునరాలోచించి రెగ్యులర్ ఉద్యోగిగా తీసుకుంటామని చెప్పాడు ఎడిటర్. "మేం గోపీకి ఇచ్చిన జీతం కూడా ఢిల్లీ ప్రమాణాలతో పోలిస్తే నవ్వు పుట్టించేంత తక్కువ'' అని ఆ పత్రిక ఎడిటరే స్వయంగా పేర్కొన్నారు. ఎలాగైతేనేం కృష్ణన్‌కి ఉద్యోగం వచ్చింది. వామపక్షాల వార్తల సేకరణ చేస్తుండేవాడు. ఎలా ఉప్పందిందో గాని 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి ఆయనకి తెలిసింది.
"2008 సెప్టెంబర్‌లో చాలా తక్కువ మొత్తానికి లైసెన్సులు దక్కించుకున్న శ్వాన్, యునిటెక్ సంస్థలు తమ వాటాలను రూ. 4,500 కోట్లు, రూ 6,200 కోట్ల చొప్పున అమ్ముకున్నాయి. ఒక్కరిగా ఆ లైసెన్సుల విలువ అంతగా పెరగడం ఏమిటని ఆశ్చర్యం వేసింది. లైసెన్సులు దక్కించుకోవడంలో ఏదో స్కాం జరిగిందనే అనుమానం వచ్చింది. ఆ విషయం గురించే ఆరా తీయడం మొదలుపెట్టాం. అదృష్టం కొద్దీ మాకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి ఓ అధికారి ముందుకొచ్చారు. తాను ఇచ్చిన సమాచారాన్ని పత్రికలో ప్రచురిస్తామని హామీ ఇస్తేనే ఇస్తానని ఆ అధికారి అన్నారు. మా ఎడిటర్‌కి చెప్పి అనుమతి తీసుకున్నాను. అప్పటి నుంచి రేయింబవళ్లు ఆ అధికారితో చర్చించడం, కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడం, వాస్తవాలను సరిపోల్చుకోవడం...అదే మా పని. ఎవరూ పసిగట్టకుండా ఉండటానికని ఆ అధికారిని ఒక్కోసారి ఒక్కో చోట కలిసేవాణ్ణి. క్రమంగా టెలికాం మంత్రిత్వశాఖలో జరుగుతున్న అక్రమాల గురించిన పూర్తి సమాచారం మాకు అందింది. ప్రధాని కూడా రాజా చేస్తున్న పనులపై అసంతృప్తితో ఉన్నారని, అసలేం జరుగుతోందో తెలుసుకోవడానికి ఒకసారి రాజాని తన కార్యాలయానికి కూడా పిలిచారని తెలిసింది. రాజా, తన అనుచరులు కలిసి స్కాం ద్వారా వచ్చిన డబ్బుని ఎవరి పేర్ల మీద ఏయే కంపెనీలలో పెట్టుబడులు పెట్టారో, స్కామ్ వల్ల ఏయే కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు, లాబీయిస్టులు లాభపడ్డారో కూడా తెలియజేశారు.
మొదటి కథనం...
మొదటి రిపోర్టు రాసిన తర్వాత రాజాని కలిసి ఆయన స్పందనను తీసుకోమని మా ఎడిటర్ నన్ను పంపించారు. అప్పుడు... తమ పార్టీలోని తన వ్యతిరేక వర్గమే నాకు డబ్బులిచ్చి ఈ పనులన్నీ చేయిస్తున్నదని రాజా ఆరోపించాడు. కొందరి పేర్లను కూడా ప్రస్తావించాడు. ఆయన సొంత ఆస్తుల గురించి నేను రాబట్టిన సమాచారం గురించి తెలుసుకొని నిర్ఘాంతపోయాడు. కథనాలు రాయడం మానేయమని అభ్యర్థించాడు. అయితే మీ స్పందనను తెలుసుకుని రమ్మని ఎడిటర్ పంపించారని, అంతవరకే కాని మిగతా విషయాలు నాకు తెలీదని నేను బదులిచ్చాను. తన ఆస్తుల గురించి మాట్లాడడానికి రాజా ఒప్పుకున్నాడు కాని కథనాలు రాయడం ఆపమని పదేపదే అడిగాడు. చాలా కార్పొరేట్ సంస్థలు కూడా ఆ మాటే చెప్పాయి. అయితే ఏ ఒక్కరూ అసభ్యంగా ప్రవర్తించడం కానీ భయపెట్టడం కానీ చెయ్యలేదు. కథనాలు రాయకుండా ఉండటానికి నాకు లంచం మాత్రం ఇవ్వజూపారు. అంతా ఇంతా కాదు... మతి పోయేంత ఎక్కువ డబ్బు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ల గురించి ఎడిటర్‌కి చెప్పొద్దని అన్నారు. అయితే నేను చేసే ప్రతి పని ఎడిటర్‌కి తెలుసని చెప్పాను. కొంతమంది నా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ రాజాని కలవడానికి కూడా ప్రయత్నించారు.
3జీ కుంభకోణాన్ని ఆపగలిగాం..
కథనాలు మొదలైన సమయంలోనే క్యాబినెట్ అనుమతి లేకుండా రాజా 3జీ స్పెక్ట్రమ్ లైసెన్సులను కారు చవక రేట్లకి కట్టబెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అందుకే చాలా కార్పొరేట్ సంస్థల ఏజెంట్లు కథనాలు ఆపమని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం 3జి స్పెక్ట్రమ్ వేలం విషయాన్ని 'ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్'కి పంపిస్తుందని అన్నారు. మాకు కావాల్సింది కూడా అదే అని మేం సమాధానం చెప్పాం. అయితే పెద్దపెద్ద రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న నా ఫ్రెండ్స్ కొందరు మాత్రం ఎవరైనా నాపై కక్ష గట్టే ప్రమాదం ఉందని నన్ను హెచ్చరించారు. ఒక రకంగా వాళ్లు నాకు వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. 3జీ స్పెక్ట్రమ్ వేలం క్యాబినెట్ చేతిలోకి వెళ్లింది. రాజా సీన్‌లో లేకుండాపోయాడు... కేంద్రానికి రూ.1.06 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.''
No comments:
Post a Comment