Sunday, December 26, 2010

'ఐఐటి'ఆనంద్... ఆరు చాప్టర్లు

సెక్యూరిటీ గార్డులుంటేగానీ పాఠం చెప్పని పంతులు గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆయన ఏటా 30 మందికి ఉచితంగా పాఠాలు చెప్పి ఐఐటీలో జెమ్స్‌గా తయారుచేస్తున్నాడంటే నమ్మగలరా? నమ్మాలి. ఎందుకుంటే జేమ్స్ కామెరూన్ అంతటివాడే ఆయన గురించి తెలిశాక ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ టీచర్ పేరు ఆనంద్. పాట్నాలో సూపర్ థర్టీ ఇనిస్టిట్యూట్‌ని నడుపుతున్నాడు.

మహారాష్ట్రలోని లవాసాలో 'నవీన ఆవిష్కరణలు - విజ్ఞానం' అంశంపై జరిగిన సదస్సుకు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా హాజరయ్యాడు. ఆ వైదికపై ఆనంద్ కుమార్ తన సూపర్ థర్టీ ఇనిస్టిట్యూట్ గురించి, అందులో శిక్షణ పొందిన విద్యార్థుల కుటుంబ పరిస్థితుల గురించి చెప్పాడు. అది విన్న కామెరూన్ ఆనంద్‌కు హ్యాట్యాఫ్ చెప్పి 'సూపర్ థర్టీ'ని తప్పకుండా సందర్శిస్తానని మాటిచ్చాడు. ఆ ఆనంద్ జీవితంలోని ఆరు అధ్యాయాలే ఇవి.

చాప్టర్ 1 : కుటుంబ భారం

ఆనంద్ కుమార్ తపాలా శాఖలో పనిచేసే గుమస్తా కొడుకు. పేదకుటుంబం. బాగా చదివి పేదరికం నుంచి బయటపడాలని అనుకునేవాడు ఆనంద్. గణితంలో బిఏ చదివాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిజీ చేయాలని కలలుగన్నాడు. కానీ అప్పుడే అతని తండ్రి చనిపోయాడు. 21 ఏళ్లకే కుటుంబభారం మోయాల్సివచ్చింది. చాలామంది సన్నిహితులు, బంధువులు తండ్రి ఉద్యోగాన్ని ఆనంద్‌కు ఇప్పించాలని ప్రయత్నించారు. కానీ ఆనంద్‌కు ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.

చాప్టర్ 2 : ఆనంద్ పాపడ్

ఆనంద్ డబ్బు సంపాదించాలనుకోలేదు. ఉన్నదాన్ని పొదుపు చేయాలనుకున్నాడు. టెలిఫోన్ కనెక్షన్ కట్ చేయించాడు. పాలు, పత్రికలు మానేయించాడు. అమ్మ చేసిన అప్పడాలు అమ్మడం మొదలెట్టాడు. ఉదయాన్నే సైకిల్‌పై రెండు సంచుల్లో అప్పడాలు తీసుకుని ఇంటింటికి తిరుగుత 'ఆనంద్ పాపడ్.. ఆనంద్ పాపడ్..' అని అమ్మేెాడు. తాను చదువుకోలేకపోయినా తమ్ముణ్ణి చదివించాలని వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో చేర్పించాడు.

చాప్టర్ 3 : మంచి టీచర్‌గా మార్కులు

1995లో ఆనంద్ మ్యాథ్స్ ట్యూషన్లు చెప్పడం మొదలెట్టాడు. స్వామి వివేకానంద్ సేవాశ్రమంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. కిరాయి నెలకు 500 రూపాయలు. ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 500 రూపాయలు. చాలామంది చేరితే కిరాయి సులభంగా కట్టేయొచ్చనుకున్నాడు. కానీ ఇద్దరు పిల్లలే చేరారు. ఆనంద్ మంచి టీచర్‌గా నిరూపించుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టింది. అప్పుడు చాలామంది విద్యార్థులు ట్యూషన్‌లో చేరారు. ఆనంద్ పాపడ్‌లు అమ్మడం మానేశాడు. ఆ ఇంట్లో టెలిఫోన్ మళ్లీ మోగింది. ఆనంద్ తల్లి కాఫీ తాగుతూ ప్రశాంతంగా పేపర్ చదువుకునే రోజులొచ్చాయి.

చాప్టర్ 4 : సూపర్ థర్టీ

ఆనంద్ ఐఐటీ పరీక్ష రాసేవారికి కూడా గణితం బోధించేవాడు. అందుకు 2001లో ఆనంద్ వసూలు చేసిన ఫీజు 15 వందల రూపాయలు. ఒక విద్యార్థి తన తండ్రి అంత ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పాడు. కానీ తనకు చదువుకోవాలని ఉందని, ఎలాగైనా తనకు ట్యూషన్ చెప్పాలని కోరాడు. అప్పుడే ఆనంద్ కొందరికైనా ఉచితంగా బోధించాలని నిర్ణయించుకున్నాడు. సూపర్ 30 ఇనిస్టిట్యూట్ పేరుతో 30 మందికి చెప్పాలనుకున్నాడు. అతను ఇంకా ప్రారంభించకముందే 800 దరఖాస్తులు వచ్చాయి. ఆనంద్ ఎంట్రన్స్ పరీక్ష పెట్టి వంద మందిని ఎంచుకున్నాడు. వారిలో పేదలను గుర్తించి కోచింగ్ మొలెట్టాడు.

చాప్టర్ 5 : నిజంగా సూపర్ 30

సూపర్ థర్టీలో చేరిన 30 మందికి సంవత్సరమంతా ఉచితంగా పాఠాలు చెప్పేవాడు ఆనంద్. వారికి భోజనం కూడా ఆనంద్ ఇంటి నుంచే వచ్చేది. వారానికి నాలుగు రోజులు తరగతులు. మిగతా రోజులు గ్రూప్ స్టడీ, చర్చలు. స్లిప్ టెస్ట్‌లు రోజూ ఉంటాయి. ఈ ఇనిస్టిట్యూట్ నుంచి 2003లో ఐజీటి - జెఇఇ ప్రవేశ పరీక్ష రాసి 18 మంది సీటు సంపాదించారు. 2004లో 22 మంది, 2005లో 26 మంది, 2006లో 28 మంది సీటు సంపాదించారు. 2008 నుంచి ఇప్పటి వరకు సూపర్ థర్టీలో 30కి 30 మంది ఐఐటీల్లో సీట్లు సంపాదిస్తూ ఆనంద్ ఇనిస్టిట్యూట్ నిజంగా సూపర్ అని నిరూపిస్తునానరు.

చాప్టర్ 6 : బాంబులకు భయపడలేదు

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆనంద్ ఇనిస్టిట్యూట్‌కు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వస్తుండడంతో చాలామందికి కన్నుకుట్టింది. సూపర్ థర్టీ ఇనిస్టిట్యూట్‌ని మూసేయాల్సిందిగా ఒక వ్యక్తి ఆనంద్‌ని బెదిరించాడు. ఆనంద్ వినకపోవడంతో ఇనిస్టిట్యూట్‌పై బాంబులేసి మరీ భయపెట్టాడు. ఆనంద్ తృటిలో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఆనంద్‌కు ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నారు. ఆ తుపాకుల నీడలో ఆనంద్ పాఠాలు చెబుతున్నాడు.

త్వరలో ఒక హైస్కూల్‌ని ప్రారంభించాలనుకుంటున్నాడు. అలాగే మ్యాథ్స్ ఒలంపియాడ్‌కు వెళ్లే విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఇనిస్టిట్యూట్‌లో చదివిన విద్యార్థులు భవిష్యత్తులో నోబెల్ బహుమతులు పొందాలని కలగంటున్నాడు.

No comments:

Post a Comment

Jai Ho .............