Friday, December 17, 2010

ఊరిస్తున్న భారత్

వ్యాపారాల కోసం విదేశాల క్యూ
ఆరు నెలల్లోనే ఐదు అగ్రదేశాల నేతల రాక
సుమారు రూ.2 లక్షల కోట్ల వాణిజ్య ఒప్పందాలు
భారత్.. అగ్రరాజ్యాలను సైతం చుట్టూ తిప్పుకుంటున్న దేశం. అన్ని దేశాల చూపు భారత్‌పైనే.. ఒకప్పుడు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించిన దేశాలన్ని ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, వ్యాపారాభివృద్ధి, ఇతరత్రా ఒప్పందాల కోసం భారత్ ముంగిట వరుసగా క్యూ కడుతున్నాయి. భారత్ ఆర్ధికాభివృద్ధి దూకుడు, దేశీ మార్కెట్‌లో వాణిజ్య అవకాశాలు పుష్కలంగా ఉండటం వీరిని ఆకర్షిస్తున్న అంశం. 2008లో ప్రపంచ దేశాలను కుదిపేసిన ఆర్థిక మాంద్యం.. అందరి దృష్టిని భారత్‌పై నిలిచేలా చేసింది. ప్రపంచమంతా మాంద్య భయంతో వణికిపోతూ ఉంటే మాత్రం భారత్ మాత్రం నిలకడగా వృద్ధిపథాన్ని కొనసాగించింది. అగ్రదేశాలన్నీ భారత్‌తో భాగస్వామ్యం కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల్లోనే ఐదు అగ్రదేశాల సారధులు భారత్ పర్యటనకు బయలుదేరడం భారత్ స్థాయిని పట్టి చూపిస్తున్నది.


బ్రిటన్‌తో షురూ... ఈ ఏడాది జూలైలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ భారత్‌కు విచ్చేసారు. కామెరాన్ తన పర్యటనను పూర్తిగా ద్వైపాక్షిక వాణిజ్యంపైనే కేంద్రీకరించటం విశేషం. భారత్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఈయన ఏకంగా తన కేబినేట్ సహచరులతో పాటు వ్యాపారవేత్తలను తీసుకుని రావటం గమనార్హం. రక్షణ రంగంలో ఈయన ఏకంగా 100 కోట్ల డాలర్ల (సుమారు 4,500 కోట్ల రూపాయలు) మేరకు ఒప్పందాలు కుదుర్చుకుని స్వదేశం తిరిగి వెళ్లారు. డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచే భారత్ జపం ప్రారంభించారు.


లక్ష్యం నెరవేర్చుకున్న ఒబామా ఇంటాబయట సమస్యలతో నలిగిపోతున్న ఒబామా నవంబర్‌లో భారత్ పర్యటనతో సాంత్వన పొందారు. భారత పర్యటనలో ఆయన స్వదేశంలో 50 వేల ఉద్యోగాల కల్పనకు వెసులుబాటు కల్పించే వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఒబామా పర్యటనలో ఇరుదేశాలు 50 వేల కోట్ల రూపాయలకు పైబడిన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్‌కు 200 కోట్ల డాలర్ల విలువైన పరికరాల దిగుమతి కాంట్రాక్టుతో పాటు, 33 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు కోసం బోయింగ్‌తో స్పైస్‌జెట్ ఒప్పందం కుదుర్చుకున్నది. భారత పర్యటనలో ఒక అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవటం ఇదే తొలిసారి.


అదే బాటలో సర్కోజీ ఒబామా వెనకే డిసెంబర్ మొదటివారంలో భారత్‌కు విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ సుమారు 80 వేల కోట్ల రూపాయల (2,000 కోట్ల డాలర్లు) మేరకు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నారు. స్వదేశంలో సంక్షోభాలు ఎదుర్కొంటున్న సర్కోజీకి ఇది నిజంగా ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌కు రెండు రియాక్టర్లతో పాటు ఇంధనాన్ని సరఫరా చేయటానికి అరెవా ఒప్పందం కుదుర్చుకోవటంతో పాటు రిటైల్, బీమా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ ఆసక్తిని కనబరిచింది. ఫ్రాన్స్ కూడా తన దగ్గరున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని బదలాయించటానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సర్కోజీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎప్పటికప్పుడు సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి.


చైనాతో చెట్టాపట్టాల్.. సర్కోజీ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే చైనా ప్రధాని వెన్ జియాబావో భారత్‌కు రావటం విశేషం. ఇరు దేశాల మధ్య సైద్దాంతిక పరమైన విభేదాలు ఉన్నప్పటికీ వాణిజ్య పరమైన ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధం కావటం గమనార్హం. వెన్ జియాబావో తన పర్యటనలో భాగంగా సుమారు 72 వేల కోట్ల రూపాయల (1600 కోట్ల డాలర్లు) విలువైన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవటానికి తన యాత్ర ఎంతగానో తోడ్పడుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 లక్షల కోట్ల రూపాయలకు పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.


మరో మూడు రోజుల్లో మెద్వదేవ్ మరో అగ్రరాజ్యాధినేత, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ ఈ నెల 21 నుంచి 22 వరకు భారత్ పర్యటించనున్నారు. మెద్వదేవ్ తన పర్యటనలో భాగంగా 15కు పైగా కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. రక్షణ, పౌర అణు సహకార రంగాల్లో ఈ ఒప్పందాలు ఉండనున్నాయి. రానున్న 15-20 ఏళ్లలో భారత్ డజనుకు పైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుండటంతో, వీటి నిర్మాణానికి అవసరమైన మద్దతును అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని భారత్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కడాకిన్ అన్నారు. వీటితో పాటు రక్షణ రంగానికి అవసరమైన ఐదో తరం ఫైటర్స్ (ఎఫ్‌జిఎ) ఉత్పత్తి కోసం సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 90,000 కోట్ల రూపాయల (2000 కోట్ల డాలర్లు)కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కడాకిన్ వెల్లడించారు.


మెద్వదేవ్ పర్యటనలో భాగంగా ట్రెబ్స్, టిటోవ్ క్షేత్రాల్లో వాటాల కొనుగోలు కోసం ఒఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్ (ఒవిఎల్) ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్షేత్రాలను అభివృద్ధి చేయటానికి గాను రష్యాకు చెందిన ఒఎఒ బాష్‌నెఫ్ట్‌తో ఒవిఎల్ కొంతకాలంగా చర్చలు సాగిస్తోంది. ట్రెబ్స్, టిటోవ్ క్షేత్రాల అభివృద్ధి హక్కుల కోసం రష్యా కోటీశ్వరుడు వ్లాడిమర్ యెవ్‌టుషెన్‌కోవ్ 60 కోట్ల డాలర్లు ఇప్పటికే చెల్లించారు. అయితే ప్రస్తుతం వీటి అభివృద్ధికి భాగస్వామిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్షేత్రాల్లో సుమారు 20 కోట్లటన్నుల వెలికితీయగల రిజర్వులున్నాయని అంచనా.


వచ్చే ఏడాది ఇయుతో... వచ్చే ఏడాది ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ (ఇయు)తో భారత్ స్వేఛ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియను మరింత వేగిరపరచటానికి భారత్,ఇయులకు చెందిన అధికారులు ప్రతి నెలా సమావేశమవుతుండటం విశేషం. 2011లో భారత్, ఇయుల మధ్య ఒప్పందం జరుగుతుందని యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ జోస్ మాన్యుయెల్ బరాసో, భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌లు బ్రస్సెల్స్‌లో ప్రకటించారు. 2009-10లో 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్‌తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 7,500 కోట్ల డాలర్లుగా ఉంది. రెండింటి మధ్య స్వేఛ్చా వాణిజ్య ఒప్పందాలు కుదిరితే వాణిజ్యం 30 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయం, పారిశ్రామిక వస్తువులు, పెట్టుబడుల విషయంలో మార్కెట్లను తెరిచి ఉంచాలని ఒప్పందంలో భారత్ - ఇయులు ప్రతిపాదించాయి.

No comments:

Post a Comment

Jai Ho .............