విద్యుత్...ఆర్థిక పురోభివృద్ధికి మూల మంత్రం. జాతి జవసత్వాలకు కీలక రూపం. పెరుగుతున్న జనాభాకు, అవసరా లకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సమాజం స్థంభించిపోయే పరిస్థితి. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగిన దార్శనికులు..నాటి, నేటి తరాలకు చెందిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి కృషి జరుపుతున్నారు. దేశ విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యానికి అదనపు శక్తియుక్తులు జోడించడానికి పాటు పడుతున్నారు.
ప్రైవేట్ ఇన్వెస్టర్ల సహకారంతో కొన్ని కంపెనీలు విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం నిధులు సేకరిస్తుండగా, మరికొన్ని పెద్ద సంస్థలు తమ అంతర్గత వనరులు, బ్యాంకు రుణాలు, ఐపివోల ద్వారా కోట్లాది మూలధనాన్ని సమకూర్చుకుంటున్నాయి. భారత్‌లో పలు పెద్ద సంస్థలు విద్యుత్ ఉత్పత్తి దృష్టి సారిస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్-జూలై మాసాలలో దేశం తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. గణాంకాలలో చూస్తే ఇది 16,434 మెగావాట్లకు సమానం అంటున్నప్పటికి దీనికి రెండు రెట్లు అధిమని నిపుణులు భావిస్తున్నారు. రానున్న ఎనిమిది సంవత్సరాల కాలంలో దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి 250 బిలియన్ డాలర్ల పెట్టుబడుల అవసరం ఉందని సిఐఐ నివేదిక తెల్పుతోంది.
ప్రైవేట్ ఈక్విటీల ద్వారా ఆసియన్ జెన్కో, ఇండియా బుల్స్, టాటా పవర్, సుజ్లాన్ ఎనర్జీ, జిఎంఆర్ ఎనర్జీ నిధుల సమీకరణకు ప్రయత్నిస్తుండగా రిలయన్స్ పవర్, కెఎస్‌కె ఎనర్జీ వెంచర్స్, అదానీ పవర్, ఎన్‌హెచ్‌పిసి, ఇండియాబుల్స్ పవర్, జెఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్‌జెవిఎన్ లిమిటెడ్ ఇప్పటికే ఐపిల ద్వారా నిధులు సమీకరించడంలో విజయం సాధించాయి. వీటితో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టిపిసి, టాటా గ్రూప్, ఎస్సార్ గ్రూప్ ఎలాగూ రంగంలో ఉండగా.. మోసర్ బేర్, గౌతమ్ థాపర్‌కు చెందిన అవంత గ్రూప్, యాక్షన్ షూస్, మన హైదరాబాద్‌కు చెందిన పయోనీర్ డిస్టలరీస్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రవేశించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని ధగధగలాడించడానికి నడుం కట్టిన పారిశ్రామికవేత్తలు, సంస్థలపై ‘సూర్య’ బిజినెస్ బ్యూరో అందిస్తున్న ప్రత్యేక కధనమిది.
రంగంలో రిలయన్స్ దిగ్గజాలు
1966లో వస్త్రాల తయారీని చేపట్టి ఆ తరువాత పాలిస్టర్, ఫైబర్ ఇంటర్మీడియట్స్, ప్లాస్టిక్, పెట్రో కెమికల్స్, పెట్రోలియం శుద్ధి, చివరిగా గ్యాస్, చమురు అన్వేషణ ఉత్పత్తి వంటి బహు కీలక రంగాలలో ప్రవేశించి జయకేతనం ఎత్తిన రిలయన్స్, అడాగ్ గ్రూప్ సారధ్యంలో పవర్ ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకులు ధీరూభాయి అంబానీ మరణించిన తరువాత ఆయన కుమారులు ముకేష్, అనిల్ అంబానీలు గ్రూప్ పగ్గాలు చేపట్టారు. 2005లో కుటుంబ వివాదల ఫలితంగా విడిపోయిన అన్నదమ్ములు తిరిగి ఈ ఏడాది మేలో కలుసుకున్నారు.
ఇప్పుడు రిల్, అడాగ్ గ్రూప్‌లు కలసి ఒకరి వ్యాపారాలలో మరొకరు ప్రవేశించేందుకు మార్గం సుగమం చేసుకుని విద్యుత్ ప్రాజెక్టులపై ప్రముఖంగా దృష్టి పెట్టారు. బొగ్గు, జల, పవన, అణు విద్యుత్ ప్రాజెక్టులతో సహా వేటిని వదలబోమని, అన్ని విభాగాలలో భారీగా పెట్టుబడులు పెడతామని తమ 36వ వాటాదారుల సర్వసభ్య వార్షిక సమావేశంలో రిలయన్స్ పరిశ్రమల అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే గ్యాస్, ఆయిల్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన రిల్‌కు విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడం పెద్ద ష్టమేమికాదు. చత్తీస్‌ఘడ్‌లో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పిలవాల్సిన బిడ్లను గత మే నుండి ఇప్పటికి మూడు సార్లు వాయిదావేశారు. అందుకు కారణం రిలయన్స్ పరిశ్రమల ప్రవేశం కోసమేనన్నది బహిరంగ రహస్యమే. ముకేష్ ఆర్థికశక్తికి, ఆలోచనలకు ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్‌టిపిసి వ్యవస్థాపక ఛైర్మన్ డి.వి.కపూర్ తోడు కావడంతో రానున్న కాలంలో రిల్ విద్యుత్ వెలుగులు విచ్చలవిడిగా ప్రసరించడం ఖాయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రిల్ బోర్డులో కపూర్ ఇప్పుడు స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు.
అనిల్ పవర్ మెరుపులు
రిలయన్స్ సామ్రాజ్యం విభజన తరువాత విద్యుత్ ప్రాజక్టులు చేపట్టిన అనిల్ ప్రస్తుతం 1,023 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుపుతున్నారు. అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఐపివో ద్వారా రూ.11,563 కోట్ల సేకరించి దేశంలో సంచలనం సృష్టించిన అనిల్ తన ప్రతిపాదిత భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 28,000 మెగావాట్ల నుండి 35,000లకు పెంచుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని రోసాలో 300 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పలు ప్రాజెక్టుల ద్వారా అనుకున్నదాని కంటే ముందే 1200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
ససాన్‌లో నెలకొల్పనున్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను కూడా గడువులోగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని, 10 వేల మెగావాట్ల ప్రాజెక్టుకు ఫైనాన్స్ క్లోజర్ పూర్తి చేశామని, దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటువుతున్న పెద్ద పవర్ ప్రాజెక్టు తమదేనని రిలయన్స్ పవర్ సిఇవో జెపి చలసాని అంటున్నారు. 2020 నాటికి 35,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి ప్రైవేట్ రంగ దిగ్గజంగా వెలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం గుల్బార్గాలో నిర్మించనున్న 1,320 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు పిలిచిన బిడ్లకు అంబానీ సోదరులు కూడా పోటీ పడుతున్నారు.
రిలయన్స్ పవర్ వివరాలు
సిఇవో : జెపి చలసాని ప్రస్తుత సామర్ధ్యం : 1,023 మెగావాట్లు ప్రతిపాదిత సామర్ధ్యం : 2020 నాటికి 35,000 మెగావాట్లు పెట్టుబడుల అంచనా : 1.36 ట్రిలియన్ డాలర్లు
No comments:
Post a Comment