Thursday, September 16, 2010

'కుట్టి' అంజులి

'కుట్టిస్రంక్'... గురించి ముగ్గురు మహిళల విభిన్న ధృర్పథాలే ఈ సినిమా కథ. దీన్ని తీస్తున్నప్పుడు దర్శకుడు షాజి కరుణ్ ఊహించి ఉండడు..ఈ సినిమాకు జాతీయ అవార్డుల పంట పండుతుందని. అలాగే కథరీత్యా తాను పరిచయం చేస్తున్న ఓ ఛాయాగ్రాహకురాలు ఈ సినిమా ద్వారా భారతీయ చలనచిత్రసీమలోనే చరిత్ర సృష్టిస్తుందని.

ఓ వ్యక్తి గురించిన ముగ్గురు మహిళల అభిప్రాయాల సమాహారం కాబట్టి దాని దృశ్యీకరణకు కూడా స్త్రీ దృక్పథం తోడైతే మరింత అందంగా ..సున్నితంగా వస్తుందనే ఉద్దేశంతోనే అంజులి శుక్లాకు కుట్టి స్రంక్ ద్వారా తొలి అవకాశాన్నిచ్చాడు షాజి కరుణ్. ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని దర్శకుడి అంచనాని మించిన నైపుణ్యాన్ని చూపి తన ప్రత్యేకతను ఫ్రేమ్ చేసుకుంది అంజులి.

ఆ కథా కమామీషు
పుణె ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో సినిమాటోగ్రఫిలో శిక్షణ పొందిన అంజులి శుక్లాను షాజి కరుణ్ 'కుట్టిస్రంక్' సినిమాకు ఛాయాగ్రహణం అందివ్వాలని అడిగినప్పుడు భయపడలేదు. ఆ బాధ్యతను ఆత్మవిశ్వాసంతో అందుకుంది.'స్వయంగా సినిమాటోగ్రాఫర్ అయిన షాజి కరుణ్ సినిమాకు ఫోటోగ్రఫీ అందించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే చిత్రీకరణకు ఆయన పెట్టింది పేరు.

రెనెటో బెరో, సంతోష్ శివన్, సన్నీ జోసెఫ్, హరి నాయర్‌లా ఆయన సినిమాలు దృశ్యకావ్యాలు. అలాంటి డైరెక్టర్ వచ్చి నా సినిమాకు నువ్వు ఫోటోగ్రఫి అందించాలని అడిగారంటే...ఇంతకన్నా అదృష్టం ఉంటుందా..? అందుకే వెంటనే ఒప్పుకున్నాను. ఆశ్యర్యమేసింది కాని భయపడలేదు. నా మీద ఆయనకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము కానివ్వలేదు' అని ఆ సినిమా అవకాశం గురించి చెప్పింది ఆమె. ఈ సినిమా షూటింగ్ వర్షాకాలం ఆరంభంలో మొదలైందట. అందుకే ఈ సినిమాలో వర్షం సీన్లకు ట్యాంకర్లతో వర్షం కురిపించాల్సిన బాధ తప్పిందని చెప్పింది అంజులి నవ్వుతూ.

నేపథ్యం
అంజులి శుక్లా పుట్టిపెరిగింది లక్నోలో. సినిమా నేపథ్యం ఏమాత్రంలేని కుటుంబం నుంచి వచ్చింది. కనీసం ఆమె పెరిగిన లక్నో ముంబై, చెన్నై, కోల్‌కత్తాల్లా కాదు. సినిమా వాసనలే మాత్రం సోకని ఊరు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి సినిమా రంగంలో...అందునా పురుషాధిపత్యంలో ఉన్న ఫోటోగ్రఫీలో నిలదొక్కుకోవడం అంటే ఓ సవాలే.

ఆ రంగాన్ని ఎంతో ఇష్టపడితే తప్ప సాధ్యం కాదు. అలాంటి ఇష్టంతోనే ఫిల్మ్‌మేకింగ్ నేర్చుకోవడం కోసం పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయింది అంజులి. అయితే తన తపనకు ఫోటోగ్రఫీ అయితేనే బాగా నప్పుతుందని గ్రహించి తర్వాత ఆ శాఖలో చేరింది. 'ఒక విషయాన్ని దృశ్యంగా మలచడానికి ఉవ్విళ్లూరుతుంటాను' అంటుంది ఆ రంగంలో ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అంజులి.

కెరీర్ తొలినాళ్లు
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత అంజులి మొదట సంతోష్ శివన్‌కు కెమెరా అసిస్టెంట్‌గా ఓ పన్నెండు సినిమాలకు పనిచేసింది. వాటిలో 'బిఫోర్ ది రైన్స్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్' అనే రెండు హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. 'సంతోష్‌శివన్‌తో పనిచేయడమంటే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ నుంచి అన్ని ముఖ్యమైన శాఖల్లో లీనమవడమే.

ఆ అనుభవం ఎంతో నేర్పుతుంది' అంటూ సంతోష్ శివన్ పనివిధానాన్ని మెచ్చుకుంది అంజులి. ఛాయాగ్రాహకుడు మనోజ్ పిళ్లై తో కలిసి 'అచనురంగథ వీడు' అనే సినిమాకూ పనిచేసింది. 'మనోజ్ పిళ్లై మొదటి సినిమా 'అచనురంగథ వీడు'కు పనిచేయడం గొప్ప అనుభవం. అంతకు ముందు సంతోష్ శివన్ చాలా సినిమాలకు నేను, పిల్లై ఇద్దరం కలిసి పనిచేశాం' అని ఆజ్ఞాపకాలను నెమరువేసుకుంది ఆమె.

అనుభవమే కాదు అవకాశం కూడా
ఈ మహామహులందరి దగ్గర పని చేయడం గొప్ప అవకాశమే కాదు మంచి అనుభవం కూడా. షాజి కరుణ్ 'కుట్టిస్రంక్'కి మొదటిసారిగా పూర్తి ఛాయాగ్రహణం అందివ్వడం మరిచిపోలేని అనుభూతే కాదు నా నైపుణ్యానికి ఆయనిచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఆ అవకాశమే నన్నివ్వాళ జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాగ్రాహకురాలిగా నిలబెట్టింది. ఇది నా తొలి మెట్టుగా భావిస్తున్నాను. ఇంతకన్నా మాటలు రావడం లేదు చెప్పడానికి' అంది సాధించిన విజయాన్ని తలచుకుంటూ అంజులి శుక్లా.

No comments:

Post a Comment

Jai Ho .............