1971లో సిక్కింపై ఒక డాక్యుమెంటరీ తీయమని అప్పటి సిక్కిం రాజు పాల్డిన్ థాండ్అప్ నగ్యాల్, ఆయన భార్య హోప్ కుకీలు సత్యజిత్‌రేను కోరారు. ఆ సమయంలో సిక్కిం రాజరికపు పాలన కింద ఉండేది. మొదట ఈ డాక్యుమెంటరీని తీయటానికి సత్యజిత్ రే అంగీకరించలేదు. తాను సినీ దర్శకుడినని.. డాక్యుమెంటరీలు తీయనని స్పష్టం చేశారు. అయితే రాజదంపతుల ఒత్తిడి పెడితే డాక్యుమెంటరీని తీయటానికి చివరకు అంగీకరించారు.
దాదాపు ఏడాదిన్నర సమయం వెచ్చించి సత్యజిత్ రే ఈ డాక్యుమెంటరీని తీశారు. సిక్కిం రాచరికపు వైభోగాలతో పాటు, అతి సామాన్యుల కష్టసుఖాలను కూడా సత్యజిత్‌రే ఇందులో చిత్రీకరించారు. సిక్కిం రాజభవనంలోని ఒక ప్రాంతంలో రాజకుటుంబీకులు తిని పారేసిన ఆహారపదార్థాల కోసం కొందరు ముష్టివాళ్లు కొట్టుకోవటాన్ని కూడా సత్యజిత్‌రే చిత్రీకరించారని- ఈ డాక్యుమెంటరీని చూసిన వాళ్లు చెబుతారు.
వాస్తవాలను అద్దంలో చూపించిన ఈ డాక్యుమెంటరీ రాజదంపతులకు నచ్చలేదు. దానిలో కొన్ని సీన్లను తొలగించమని సత్యజిత్‌రేను కోరారు. కాని తొలగించిన తర్వాత కూడా డాక్యుమెంటరీ రాజదంపతులకు నచ్చలేదు. 1975లో భారతదేశంలో సిక్కిం విలీనమయింది కాని సిక్కిం మీద తీసిన డాక్యుమెంటరీని బహిరంగ ప్రదర్శనకు అనుమతిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావించింది. దీనితో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది.
అయితే దీన్ని విదేశాలలో జరిగిన కొన్ని చిత్రోత్సవాలలో ప్రదర్శించారు. రెండు ప్రింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లోను, మరొకటి ఇంగ్లాండ్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ ఉన్నాయి.
దీని ప్రదర్శనకు అనుమతించాలని చాలా కాలం నుంచి సత్యజిత్‌రే అభిమానులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే ఏడాది మేలో జరగనున్న సత్యజిత్ రే 90వ జయంతి వేడుకలలో దాన్ని ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సత్యజిత్‌రే తీసిన డాక్యుమెంటరీని చూసే అవకాశం మనకు కలగనుంది.
No comments:
Post a Comment