కదిరేసన్ చిన్నప్పుడు అందరిలాగే స్కూలుకెళ్లాడు. కాని ఒకరోజు మధ్యాహ్నం 'మీ నాన్నగారు చనిపోయార'ంటూ పాఠశాలకు కబురొచ్చింది. చావంటే ఏంటో తెలియని చిన్నతనం అతనిది. తన జీవితం ఏదో అగాథంలో పడిపోబోతున్నదని అప్పుడతనికి తెలియదు.
పెద్ద దిక్కు పోయిన బాధలో కన్నతల్లి.. ఇంట్లో చిల్లిగవ్వలేక కాలుతున్న కడుపు.. స్కూలుకు వెళుతున్న పిల్లల్ని చూసినప్పుడు తెలియకుండానే కారే కన్నీళ్లు.. ఇలాంటి పరిస్థితుల్లో కడుపు నిండాలంటే కనిపించిన దారిలో నడవాల్సిందే. బతుకుతెరువులో అతని ప్రయాణం మొదలయింది. పనికోసం వేట.. పైసా కోసం వెతుకులాట.. దొరికిన ఉద్యోగమల్లా చేస్తూనే వచ్చాడు. కొంత కాలం ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి 1979లో ఇండియన్ ఆర్మీలో చేరాడు.
టర్నింగ్ పాయింట్
1980లో కదిరేసన్ అబ్దుల్ కలామ్ దగ్గర డ్రైవర్‌గా చేరాడు. కలామ్ అప్పుడు భోపాల్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేస్తుండేవారు. కలామ్‌కి కదిరేసన్ బాగా నచ్చాడు. కదిరేసన్ తన ఆశయాలను అభిలాషలను ఎప్పుడూ కలామయ్య(కలామ్ గారిని కదిరేసన్ అలాగే పిల్చేవాడు)తో చెబుతుండేవాడు. కలామయ్య ఎక్కడికి వెళ్లినా ఆయనతోపాటు వెళ్తుండేవాడు కదిరేసన్.
చదువుకోవాల్సిన అవసరాన్ని గురించి కలామయ్య విద్యార్థులకు చెబుతున్నప్పుడు చాలాసార్లు విన్నాడు. ఆ మాటలే ఆయనకు స్ఫూర్తినిచ్చాయి. "ఒక రోజు కారులో వెళ్తుండగా 'నువ్వు నీ చదువు ఎందుకు కొనసాగించకూడదు కదిరేసన్?' అని అడిగారు కలామయ్య. "అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేనేంటి ఇప్పుడు చదువుకోవడం ఏంటి? అనుకున్నాను. కలలు కన్నావు. ఆ కలల్ని ఎందుకు నిజం చేసుకోకూడదు. ప్రయత్నించి చూడు అని ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేనిది'' అని చెప్పారు కదిరేసన్. కలామ్ దగ్గర ఆయన ఐదున్నర సంవత్సరాలు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే మళ్లీ చదువు మొదలుపెట్టాడు.
పది నుంచి పిహెచ్‌డి వరకు
చిన్నప్పుడే వదిలేసిన పుస్తకాలన్నీ తిరిగి చదవడం ప్రారంభించాడు. పదింటి నుంచి ఆరింటి వరకు ఉద్యోగం పూర్తయ్యాక ఇంటికి వెళ్లి కష్టపడి చదివేవాడు. పది పాసయ్యాడు. తర్వాత ఇంటర్, మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి దూర విద్యలో బిఏ, ఎంఏ పొలిటికల్ సైన్స్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి బిఇడి, ఎంఇడి, మళ్లీ కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేశాడు. తర్వాత లా కూడా చేసి సుందరనర్ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేశాడు.
2001లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పాసయ్యాడు. "నేను పిహెచ్‌డి పూర్తి చేసిన తర్వాత మొదటిసారి కలామ్ అయ్యగారికి ఫోన్ చేశాను. నాకు ఉద్యోగం వచ్చిన విషయం కూడా చెప్పాను. అందుకు ఆయన చాలా సంతోషించి నన్ను దీవించారు. ఆ దీవెనలు నా జీవితంలో నేను మరిచిపోలేనివి. అంతకంటే గొప్పవి ఈ ప్రపంచంలో నాకు ఇంకేమీ లేవు. ఆయనకు నా మీద నమ్మకం ఉంది. దాన్ని నేను ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకున్నాను'' అని ఎంతో ఆనందంగా చెప్పాడు కదిరేసన్.
నాలాంటి వాళ్లకు సహాయం చేస్తా...
కదిరేసన్‌కు ఇప్పుడు 47 ఏళ్లు. ఆయన పుట్టి పెరిగింది వడచెన్నిమలైలో. ఇప్పుడు ఆయన అక్కడే అరిగర్ అన్న గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. "మా మాష్టారి గారి జీవితం ఒక అద్భుతమైన కథ. జీవితంలో అన్ని కష్టాలు, బరువు బాధ్యతలు ఉండి కూడా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని చూశాక ప్రపంచంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదన్నది నిజమని అపిస్తుంటుంది.
ఎంతో దృఢ సంకల్పం ఉంటే కానీ అది సాధ్యం కాదు'' అని చెప్పాడు కదిరిసేన్ విద్యార్థి సంతోష్ మణి. "అప్పట్లో పరిస్థితులు అనుకూలించక చదువు మానేసి పనిలో చేరాను. నా జీవితంలో అత్యంత బాధాకరంగా తీసుకున్న నిర్ణయం అది. అందుకే చదువుకోవాలని ఆలోచన ఉన్నా అవకాశం లేని వాళ్లకు నా వంతు సహాయం చేయాలనుకుంటున్నాను'' అని ముగించారు కదిరేసన్.