Sunday, May 6, 2012

అబ్దుల్ కలామ్ - స్వప్నరథ సారథి

‘‘కలలు కనండి. నిజం చేసుకోండి’’.
మంచిది. కన్నంత మాత్రాన నిజమైపోతాయా?!
లేదు. కష్టపడాలి.
కష్టమొక్కటేనా?
లేదు. కమిట్‌మెంట్ ఉండాలి.
ఇంకా?!
ప్లానింగ్, ప్రిపరేషన్, పర్సెవరెన్స్...
దేవుడా! ఇవన్నీనా?!
అవును. ఇవన్నీ మరియు మరికొన్ని.
ఈ మాత్రానికి కలలెందుకు? కనడమెందుకు?
అంటే?
నేరుగా ఒళ్లు హూనం చేసుకుంటే పోలా?!
కలంటే నిద్రలో వచ్చేది కాదు.

మరి?
నిద్రపట్టకుండా చేసి, లక్ష్యానికి చేర్చేది.
ఎవరన్నారీ మాట?
అవుళ్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్దుల్ కలామ్!
ఇప్పుడెందుకొచ్చారాయన!!
యువభారత్ తాజాగా ఒక కలకంటోంది.
ఏమిటది?
కలామ్ రెండోసారి రాష్ట్రపతి అవ్వాలని!
కల నిజమౌతుందా?
బయోగ్రఫీ చదవండి.



‘‘మీకు ఆసక్తి లేకపోవచ్చు. కానీ కలామ్‌జీ... రాష్ట్రపతిగా మీరు మళ్లీ రావడం కోసం మేమంతా ఆశగా ఎదురు చూస్తున్నాం. మీలాంటి నాయకుడు మాక్కావాలి’’.

‘‘10 జన్‌పథ్‌కు కలామ్ ఒక ఆప్షన్ కాకపోవడంలో వింతేముంది?! కానీ ఈ దేశంలోని యువతీయువకులు ఆయన్ని రెండోసారి రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నారు’’.


‘‘దురదృష్టం చూడండి. మతతత్వ పార్టీగా పేరుపడిన బి.జె.పి... ముస్లిం అయిన కలామ్‌ను రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తోంటే, సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వెనకాముందూ ఆలోచిస్తోంది’’.


‘‘గ్రేట్ మేన్. స్టూడెంట్స్ రోల్ మోడల్. కలామ్ వంటి వ్యక్తి ఇంకొకసారి రాష్ట్రపతి అవడానికి ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి?’’.


5,500 నుంచి 6,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర ఉపరితల క్షిపణి ‘అగ్ని 5’ ను ఏప్రిల్ 19న ఒడిశాలోని వీలర్ ఐలండ్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించి చూశాక... ఇంటర్నెట్‌లోని సోషల్ నెట్‌వ ర్కింగ్ సైట్‌లలో అగ్ని టీమ్‌కు అభినందనలు తెలుపుతూ, మన మిస్సయిల్ మేన్... డాక్టర్ కలామ్‌ను మళ్లీ ఒకసారి భారత రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నట్లు యంగ్ ట్వీటరేట్స్ (ట్వీట్ చేసేవాళ్లు), ఎఫ్‌బియన్స్ (ఫేస్‌బుక్ యూజర్లు) పోస్ట్ చేసిన ఆకాంక్షలివన్నీ!

*******

ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జూలై 24తో ముగియబోతోంది. జూలై 25న దేశం కొత్త రాష్ట్రపతితో కళకళలాడాలి. అయితే యంగ్ ఇండియా పూర్తిగా కొత్త ముఖాన్ని కోరుకోవడం లేదు. ‘పూర్వ’ వైభవం కోసం కుతూహలపడుతోంది.

‘అగ్ని -5’ పరీక్షకు, అబ్దుల్ కలామ్ అభ్యర్థిత్వానికి సంబంధం లేకపోయినా, రాష్ట్రపతి ఎన్నికకు మూడు నెలల ముందు జరిగిన అగ్ని పరీక్ష సక్సెస్ కావడంతో యువతరం రెండిటినీ కలిపి చూస్తోంది. ఆ మాటకొస్తే ‘అగ్ని’... మన దగ్గర మాత్రమే ఉన్న క్షిపణి కాదు. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల దగ్గర ఉంది.
కానీ కలామ్ మన సొంతం. మనకు మాత్రమే ప్రత్యేకం. ఆ విధంగా అగ్రరాజ్యాలకన్నా మనం అధికులం!
మన ‘ఆధిక్యరాజ్యానికి’ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి.
కనీసం పద్నాలుగు మంది ప్రముఖులు ప్రస్తుతం రాష్ట్రపతి రేస్‌లో ఉన్నారు. లేనిదల్లా కలామ్. అయితే రేస్‌లో ఆయన ఉండాలని ఆశిస్తున్న దేశ ప్రజలు కోట్లలో ఉన్నారు.
ఏమిటి కలామ్ ప్రత్యేకత?!
కలామే ఒక ప్రత్యేకత.
ఇందుకు నిదర్శనం... రాష్ట్రపతి అభ్యర్థిగా మిగతావారితో పోల్చి చూసినప్పుడు - మునుపు రాష్ట్రపతిగా చేసి ఉన్నప్పటికీ - కలామ్‌కే ఎక్కువ సానుకూలతలు కనిపించడం.
మళ్లీ ఇంకో ‘ప్రతిభా పాటిల్’ని రాష్ట్రపతిగా ముందుకు తెచ్చే మూడ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ లేదు. 2007లో పశ్చిమ బెంగాల్, కేరళలలో అధికారంలో ఉన్న వామపక్షాల మద్దతుతో ఆ పార్టీ పాటిల్‌ను నామినేట్ చేసింది. ‘తొలి మహిళా రాష్ట్రపతి’ అనే ప్రతిష్ట కోసం యు.పి.ఎ. ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పట్టుపట్టడంతో పాటిల్ రాష్ట్రపతి అయ్యారు.

ఇక రెండో చాయిస్ ప్రస్తుత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ. పాటిల్ రాష్ట్రపతి అయిన ఏడాదే (ఆగస్టులో) ఈయనా ఉప రాష్ట్రపతి అయ్యారు. మనిషి మర్యాదస్థుడు. మాటకారి. పెద్ద పెద్ద దౌత్యహోదాలలో ఉండి వచ్చినవారు. వివాదాలకు దూరంగా ఉంటారు. సర్వామోద యోగ్యత కల ముస్లిం. వామ పక్షాలు, ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈయన వైపు ఉంటుందా అన్నది సందేహమే. ఎందుకంటే హమీద్ నూటికి నూరు పాళ్లు కాంగ్రెస్‌వాది కారు. అలాగే కాషాయ శిబిరం ఈయనకు మద్దతు ఇస్తుందన్న గ్యారంటీ లేదు.


మూడో వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. కష్టాల్లో యు.పి.ఎ.ను గట్టెక్కిస్తున్న పెద్ద దిక్కు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి. రాజనీతిజ్ఞుడు, పాలనా దక్షుడు. పార్టీలో, ప్రభుత్వంలో ప్రధాన అనుసంధానకర్త. అన్ని రాజకీయ పార్టీలలో స్నేహితులను, సన్నిహితులను కలిగివున్నవారు. ప్రణబ్ రాష్ట్రపతి అవుతున్నారంటే ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించవు. అయితే ఇవన్నీ కూడా ఆయనకు ప్రతికూల అంశాలే అయ్యే ప్రమాదం ఉంది! ఈ అపర చాణక్యుడిని రాష్ట్రపతి భవన్‌కు పంపి కాంగ్రెస్ తన చేతిని తెగనరుక్కుంటుందా అన్నది ప్రశ్న. పెపైచ్చు ప్రణబ్‌కు గానీ హమీద్‌కు గానీ తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బి.జె.పి ప్రకటించింది.

ఇంకొకరు ఎం.కె. ఆంటోనీ. ప్రస్తుత రక్షణశాఖ మంత్రి. రాజ్యసభ సభ్యుడు. ముప్పై ఆరేళ్ల వయసుకే ముఖ్యమంత్రి అయిన ఆంటోనీ కాంగ్రెస్‌లో ఇప్పుడు సీనియర్ లీడర్. ప్రజల్లో పేరు ప్రతిష్టలున్నాయి. కేరళలో ఆయన్ని ‘సెయింట్ ఆంటోనీ’ అనేవాళ్లూ ఉన్నారు. సచ్ఛీలుడు. అయితే రాష్ట్రపతి అయేందుకు ఈయనకున్న అడ్డంకి... జాతీయ స్థాయిలో ఓటు బ్యాంకు లేని క్రిస్టియన్ అవడం. కాషాయ శిబిరం కూడా ఆంటోనీని సమర్థించే అవకాశాల్లేవు.


రాష్ట్రపతి పదవికి వినిపిస్తున్న మరొక పేరు గోపాల్ కె. గాంధీ. మహాత్మాగాంధీ ఆఖరి మనవడీయన. పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పని చేశారు. పాలనాపర ంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న హోదాలలో సేవలు అందించారు. వివిధ దేశాలకు భారతీయ రాయబారిగా, దౌత్యాధికారిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ మనిషి కారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ఇస్తున్నప్పటికీ, వామపక్షాలు మాత్రం ఈయన విషయంలో ప్రస్తుతానికైతే మౌనంగా ఉండిపోయాయి.


ఇక కరణ్ సింగ్! ఎప్పుడు రాష్ర్టపతి ఎన్నికల ప్రస్తావన వచ్చినా ఎప్పుడూ వినిపించే పేరు. కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్. రాజ్యసభ ఎం.పి., జమ్మూ-కాశ్మీర్ రాచకుటుంబీకుడు. హైందవ పండితుడు. రచయిత. దౌత్యవేత్త. ఎ.ఐ.సి.సి. విదేశీ వ్యవహారాల విభాగం ఛైర్మన్‌గా చేశారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ అధ్యక్షుడిగా, యునెస్కోలో భారత రాయబారిగా ఉన్నారు. అయితే ఎంచేతో కరణ్ సింగ్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఏనాడూ ఆసక్తి చూపలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి.


వీళ్లతో పాటు ఇంకా... నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, ప్రధాని మన్మోహన్‌సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నా హజారే, టాటా గ్రూపు కంపెనీల ఛైర్మన్ రతన్ టాటా, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మొహిసినా కిద్వాయ్, జనతాదళ్ (యునెటైడ్) అధ్యక్షుడు శరద్ యాదవ్, టెక్నో మేధావి శ్యామ్ పిట్రోడా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరిని ఎవరు ప్రతిపాదించినా, ఎవరిని ఎవరు సమర్థించినా ఉమ్మడి సానుకూలతను (ఒక్క కాంగ్రెస్ నుంచి తప్ప) దాదాపుగా కలిగి ఉన్న వ్యక్తి ఇప్పటి వరకైతే అబ్దుల్ కలామ్ ఒక్కరే!

*******

సరిగ్గా పదేళ్ల క్రితం 2002లో అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు దేశ రాజకీయాలలో పూర్తిగా ఆయనొక కొత్త మనిషి. అప్పటివరకు ఒక క్షిపణి శాస్త్రవేత్తగా మాత్రమే ప్రఖ్యాతుడై ఉన్న కలామ్... ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. తర్వాతి ఐదేళ్లూ యువతరం ఆ డెబ్బై ఏళ్ల మనిషిని అనుసరించింది, ఆయన్ని అనుకరించింది. చివరికి ఆయన హెయిర్ స్టెయిల్‌ని కూడా కుర్రాళ్లు వదల్లేదు!

గుజరాత్ అల్లర్లలో గాయపడిన రెండు వర్గాల మధ్య పూర్వపు సయోధ్య, సుహృద్భావం ఏర్పడేందుకు కలామ్ ఎంపిక తోడ్పడవచ్చని ప్రధాని వాజపేయి నాయకత్వంలోని అప్పటి ఎన్.డి.ఎ. ప్రభుత్వం భావించడంతో కలామ్ రూపంలో మన దేశానికొక దార్శనికుడు లభించారు.


రాష్ట్రపతి అవకముందు కలామ్ ఎలా ఉన్నారో, అయ్యాకా అలానే ఉన్నారు! భుజాల మీదకి దిగిన జులపాలను కురచగా కత్తిరించుకోబోతున్నానని కానీ, తన దుస్తుల విషయమై పునరాలోచన జరుపుతానని గానీ ఆయన ఎలాంటి హామీలూ ఇవ్వలేదు. కాళ్లకు క్రితం రోజు వేసుకున్న స్లిప్పర్స్‌నే రాష్ట్రపతి భవన్‌లోనూ వేసుకుని తిరిగారు. అయితే తానొక కొత్త భారత్‌ను దర్శించేందుకు శ్రద్ధ వహించబోతున్నానని మాత్రం ఆయన స్పష్టంగా తెలియజెప్పారు.


‘‘మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలి. అంటే దానర్థం పేదరికమే లేని దేశం అని. సంపన్న దేశం అని. ఆరోగ్యవంతమైన దేశం అని. పిల్లలంతా సంతోషంగా జీవిస్తున్న దేశం అని’’ - అన్నారు కలామ్, బాధ్యతలు స్వీకరించిన రోజు.


రాజకీయ సాంగత్యమే లేని ఈ పెద్దమనిషి దగ్గర దేశాన్ని అభివృద్ధి పథంలోకి పంపే రాకెట్లు ఏముంటాయన్న ప్రశ్న ఆనాడు రాజకీయ పండితులను ఆలోచనలో పడేసింది. అయితే ఇరవై ఏళ్లపాటు రాకెట్ ఇంజినీరుగా, మిస్సయిల్ టెక్నాలజిస్టుగా ఆరుగురు ప్రధాన మంత్రులను చూసిన కలామ్... యువకుల కలలకు ఇంధనంగా మారి, వారిలో నిప్పును రాజేశారు. కలామ్ దేన్నయితే అభివృద్ధి అన్నారో దాన్ని సాధించేందుకు యువభారత్ ముందుకు నడిచింది. ప్రస్తుతం దేశం కోసం నిస్వార్థంగా సేవచేస్తున్న ఎందరో యువతీయువకులలో ఆయన ప్రవచన రక్తం ప్రవహిస్తోంది.


కలామ్‌కి ముందు కె.ఆర్.నారాయణన్, శంకర్ దయాళ్ శర్మ, ఆర్. వెంకటరామన్, జ్ఞానీజైల్‌సింగ్, నీలం సంజీవరెడ్డి, వి.వి.గిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మాద్, జకీర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పూర్తికాల రాష్ట్రపతులుగా పని చేశారు. వీరందరిలోనూ కలామ్ భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తారు. కలామ్ శాకాహారి. అవివాహితులు. రాష్ట్రపతి అయిన తొలి శాస్త్రవేత్త, పదవిలో ఉండగా ‘భారతరత్న’ పొందిన తొలి రాష్ట్రపతి కూడా. అన్నిటికన్నా విలక్షణమైనది ఆయన వ్యక్తిత్వం. కలామ్ ఏనాడూ తనని తను ప్రత్యేకించి ఒక ముస్లింగా వ్యక్తీకరించుకోలేదు. రెండు మతాలలోని మూల గ్రంథాలను చక్కగా చదివి అర్థం చేసుకున్నారు. ఆచరించారు. అంతరార్థాలను గ్రహించి వాటి సారాన్ని ప్రబోధించారు.


కలామ్ తన ఆలోచనలను, ఆదర్శాలను, తను కలగంటున్న భారతదేశ స్వరూపాన్ని మూడు పుస్తకాలలో పొందుపరిచారు.

ఇండియా 2020 : ఎ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం
వింగ్స్ ఆఫ్ ఫైర్ : ఏన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
ఇగ్నైటెడ్ మైండ్స్ : అన్‌లీషింగ్

ఈ మూడూ కలిసిందే కలామ్ జీవిత చరిత్ర.
యువ కలామ్‌ల భవిష్యత్ జీవన యాత్ర.
*******

కలామ్ బాల్యం ‘సురక్షితమైనది’! ఈ మాట వింతగా ఉండొచ్చు. ఈనాటి బాల్యాలతో పోల్చి చూస్తే సురక్షితం అనేది ఎంత పెద్ద భాగ్యమో అర్థమౌతుంది. అందుకే కలామ్ ఎప్పుడూ ‘సెక్యూర్డ్ చైల్డ్‌హుడ్’ గురించి మాట్లాడుతుంటారు. అన్ని విధాలా సెక్యూర్డ్‌గా ఉన్నప్పుడే బాల్యం చక్కగా వికసిస్తుందని నమ్మిన వ్యక్తి ఆయన. కలాం బాల్యం కూడా అలా పదిలంగా వికసించిన కుసుమమే. ఈ సంగతి ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’లో తెలుస్తుంది.


‘‘నేనొక మధ్యతరగతి తమిళ కుటుంబంలో పుట్టాను. నాన్నగారు జైనులాబ్దిన్. ఆయన పెద్దగా చదువుకోలేదు. పెద్దగా కలిగిన వారు కూడా కాదు. కానీ సహజసిద్ధమైన ఆయన ఔదార్యానికీ, వివేక గుణానికి ఈ ప్రతికూలతలు అడ్డంకి కాలేకపోయాయి. ఇక ఆయనకు తగిన జీవన సహచరి మా అమ్మగారు. రోజుకు ఎంతమందికి ఆవిడ ఆత్మీయంగా భోజనం వడ్డించేవారో నాకైతే గుర్తు లేదు కానీ ఇంట్లో వాళ్లకన్నా బయటి వాళ్లకే ఎక్కువ విస్తళ్లు పరుచుకునేవని జ్ఞాపకం. మేమున్నది మా పూర్వీకులు కట్టించిన పాత ఇంట్లో. పందొమ్మిదవ శతాబ్దపు నడి దశాబ్దాల నాటిది. రామేశ్వరంలోని మసీదు వీధిలో ఇంత పొడవున సున్నపురాళ్లు, ఇటుకలతో కనిపించే పక్కా ఇల్లేదైనా ఉంటే అది మాదే. నాన్న చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని లాక్కొచ్చేవారు. అనవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు అమర్చేవారు కారు. అత్యవసరమైన వాటిని నిర్లక్ష్యం చేసేవారు కారు. తిండి, మందులు, బట్టలు ఆయన ప్రాధాన్యాంశాలు. అలా నా జీవితం అన్ని విధాలా ఆయన చేతుల మధ్య సురక్షితంగా గడిచింది’’
అని రాసుకున్నారు కలామ్. నిజాయతీ, స్వీయ నియంత్రణ... తల్లిదండ్రుల నుంచి కలామ్‌కు సంక్రమించిన గుణాలు. దయ, దైవభక్తి కూడా వాళ్ల నుంచి అబ్బినవే.

రామేశ్వరంలో ప్రాథమిక విద్య అయ్యాక కలామ్ రామనాథపురంలోని షువర్ట్స్ హైస్కూల్‌లో చదివారు. ఆ తర్వాత పై చదువులకు తిరుచిరాపల్లి వెళ్లారు. షువర్ట్స్ స్కూల్ చదువు పూర్తయ్యేనాటికే కలామ్ పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం గల బాలుడిగా, ఎందులోనైనా విజయం సాధించి తీరాలనే దృఢచిత్తుడిగా తయారయ్యాడు.


తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బి.యస్సీ చదివాక కలామ్ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో చేరారు. తర్వాత బెంగుళూరు లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ట్రెయినీగా చేరారు. ఏరోనాటికల్ ఇంజినీర్‌గా అప్పటికి కలామ్‌కు ఉన్న ఆప్షన్ రెండే రెండు. డెరైక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్స్ - డి.టి.డి. అండ్ పి (రక్షణ మంత్రిత్వశాఖ) లో చేరడం, లేదంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు వెళ్లిపోవడం. కలామ్‌కు ఎయిర్ ఫోర్స్ అంటే ఇష్టం. కానీ అందులో చేరలేకపోయారు. దాంతో డి.టి.డి అండ్ పి (ఎయిర్) ఆధ్వర్యంలోని టెక్నికల్ సెంటర్ (పౌర విమానయానం)లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా చేరారు. జీతం రూ.250. అలా ఎయిర్‌ఫోర్స్ డెరైక్టరేట్‌లో చేస్తున్నప్పుడే ఆయన కల ఫలించి ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్‌లో (ఇస్రోకు ముందరి స్వరూపం)లో జాబ్ వచ్చింది. అలా కలామ్ రాకెట్, మిస్సయిల్ టెక్నాలజీ కెరీర్ మొదలైంది.


భారత రాష్ట్రపతి అయ్యే నాటికి కెరీర్‌లో కలామ్ నాలుగు దశలు దాటి వచ్చారు. మొదటి దశ (1963-82). ఆయన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌లో వివిధ హోదాలలో పని చేసిన దశ. అక్కడ ఫైబర్ రీ ఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్, ఏరోడైనమిక్స్, డిజైన్ గ్రూపులో అనుభవం గడించాక తంబాలోని ఉపగ్రహ ప్రయోగ వాహక బృందంలో చేరారు. అక్కడే ఎస్.ఎల్.వి-3 మిషన్ ప్రాజెక్ట్ డెరైక్టర్ అయ్యారు. శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని, ఏరోడైనమిక్స్‌ని అభివృద్ధి పరచడంలో కీలకపాత్ర పోషించారు. ‘రోహిణి’ అనే శాస్త్రపరిజ్ఞాన సంబంధ ఉపగ్రహాన్ని కలామ్ నేతృత్వంలోని ఎస్.ఎల్.వి-3 ప్రాజెక్టు 1980 జూలైలో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మన రాకెట్ వ్యవస్థ బలం పుంజుకున్నది కూడా కలామ్ హయాంలోనే. తన కెరీర్‌లోని తొలి దశ గురించి వ్యాఖ్యానిస్తూ - ఈ దశలో నేను ముగ్గురు మహా గురువుల నుంచి నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నాను. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఫ్రొఫెసర్ సతీశ్ థావన్, డాక్టర్ బ్రహ్మ ప్రకాశ్. ఇది నా జ్ఞాన సముపార్జన దశ’’ అన్నారు కలామ్.


కలామ్ రెండో దశ 1982లో డి.ఆర్.డి.ఓ. (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లో మొదలై ంది. డి.ఆర్.డి.ఓ. డెరైక్టర్‌గా ఆయన ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిస్సయిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు సారథ్యం వహించారు. నాగ్ (యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సయిల్), పృథ్వి (బ్యాటిల్ ఫీల్డ్ మిస్సయిల్), ఆకాశ్ (ఎయిర్ మిస్సయిల్) త్రిశూల్ (క్విక్ రియాక్షన్ ఎయిర్ మిస్సయిల్) అగ్ని (మధ్యశ్రేణి మిస్సయిల్) వంటివన్నీ కలామ్ ఆధ్వర్యంలో తయారైనవే. మిస్సయిల్ టెక్నాలజీని అభివృద్ధి పరచడం కోసం ఆయన మూడు ప్రయోగశాలల్ని నెలకొల్పారు. ‘‘ఈ దశలో ఎన్నో వైఫల్యాలు, కొన్ని విజయాలు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ధైర్యంగా ముందుకు సాగాను. ఇది నేను వైఫల్యాలను తట్టుకోవడం నేర్చుకున్న దశ’’ అంటారు డాక్టర్ కలామ్.


భారతీయ రక్షణ సామర్థ్యాలు మెరుగవడంలోనూ డాక్టర్ కలామ్ కృషి ఉంది. ప్రధానంగా తన మూడో దశలో ఆయన మన దేశాన్ని అణ్వాయుధ శక్తిగా మలిచేందుకు ఆరాటపడ్డారు. రక్షణ దళాల సహకారంతో డి.ఆర్.డి.ఓ., డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుకు కీలకమైన సేవలు అందించారు. టెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్ అసెస్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా టెక్నాలజీ విజన్ 2020, ఇండియా మిలీనియం మిషన్స్ (ఐ.ఎం.ఎం.2020) రూపొందించారు. భారత ప్రభుత్వానికి శాస్త్రసాంకేతిక ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవీ బాధ్యతలు ముగియడంతోనే కలామ్ నాలుగో దశ మొదలైంది.


చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో టెక్నాలజీ అండ్ సొసైటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రొఫెసర్‌గా చేరారు డాక్టర్ కలామ్. టెక్నాలజీ లక్ష్యాల సాధనలో తన కలలను సాకారం చేసుకునేందుకు యువకుల మేధస్సుకు చురుకుపుట్టించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు 2003 ఆగస్టుని ఒక గడువుగా పెట్టుకున్నారు. ఆ లోపు దేశంలోని వివిధ ప్రాంతాలలో కనీసం లక్షమంది విద్యార్థులనైనా కలవాలనుకున్నారు. అప్పటికే ఆయన నలభై వేల మంది విద్యార్థులను కలిసి స్ఫూర్తినిచ్చారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా కలామ్ కెరీర్ మలుపు తిరిగింది. బహుశా తను కూడా ఊహించని విధంగా ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత భారతరత్న కూడా అయ్యారు!

*******

రాజకీయాల్లో వినేవాళ్లు ఉండరు. అంతా చెప్పేవాళ్లే. ఎవరి దారి వారిది. ఎవరి ‘స్కూల్’ వారిది. ఎవరి సిలబస్ వారిది. కలామ్ వంటి ‘ప్రొఫెసర్ క్రాంతదర్శి’ మాట అసలే పట్టించుకోరు. ఆయన వల్ల తమకేదైనా పని జరుగుతుందా అని ఆలోచిస్తారు. అంత వరకే. కలామ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులకొక విషమ పరీక్ష ఎదురైంది. ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ బిల్లును ఆయన అనుమతి కోసం పంపారు. పంపించేటప్పుడే ఆయనపై డౌట్‌తో పంపారు. ఈ పెద్ద మనిషి ఓకే అంటాడా? అని. డౌట్ ఎందుకంటే ఆయన ‘పీపుల్స్ ప్రెసిడెంట్’. వాళ్లు పంపింది పొలిటీషియన్స్ బిల్లు. పార్లమెంటు సభ్యులు ఏకకాలంలో రెండు పదవులను కలిగి ఉండడాన్ని నిరోధిస్తున్న రాజ్యాంగ నిబంధనను సడలించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లు అది. చివరికి వారు భయపడినంతా అయింది. కలామ్ దాన్ని తిప్పి పంపారు!


దేశాన్ని ముందుకు నడిపించాలంటే ఒత్తిళ్లకు లొంగనవసరం లేని స్వతంత్ర అధికారం ఉండాలి. సాధారణంగా రాష్ట్రపతులందరికీ అలాంటి అధికారం ఉంటుంది. కలామ్‌కి ఇలాంటి అధికారంతో పాటు అదనంగా సంకల్ప బలం కూడా ఉంది. బహుశా అదే ఆయన్ని 2007లో ఇంకోసారి రాష్ట్రపతిని కానీయకుండా అడ్డుకుని ఉండాలి. అలా కాలేకపోవడాన్ని ఆయనైతే పెద్దగా పట్టించుకోలేదు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న కలామ్ అభిమానులు అప్పట్లో తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. వాళ్లకు ఆయన లీడర్ షిప్ నచ్చింది. లీడర్‌షిప్‌కి కలామ్ ఇచ్చిన డెఫినిషన్ నచ్చింది. నడిపించడానికి కాలూ చెయ్యీ కదిలే స్వేచ్ఛ ఉండాలి. కాలూ చెయ్యీ కదల్చనవసరం లేకపోవడమే స్వేచ్ఛ అనుకునేవాళ్లు ఎప్పటికీ నాయకులు కాలేరు. కలామ్ ఇచ్చిన నిర్వచనానికి స్థూలంగా అర్థం ఇదే.

*******

రాజకీయాలకు అతీతమైన ప్రజా నాయకుడు డాక్టర్ అబ్దుల్ కలామ్. కలామ్ రెండోసారి భారత రాష్ట్రపతి అయినా, కాకున్నా... రెండోసారి భారత రాష్టపతి కావడానికి కలామ్ ఆసక్తి చూపినా, చూపకున్నా...

ఆయన మాత్రం ఎప్పటికీ ‘పీపుల్స్ ప్రెసిడెంటే’!
‘ప్రెసిడెంట్’ అనే హోదా కన్నా ‘పీపుల్స్ ప్రెసిడెంట్’ అనే హోదా ఘనమైనది!
- సాక్షి ఫ్యామిలీ
ఎ.పి.జె. అబ్దుల్ కలామ్, మాజీ రాష్ట్రపతి
జననం : 15 అక్టోబర్ 1931
జన్మస్థలం : రామేశ్వరం (తమిళనాడు)
తల్లిదండ్రులు : జైనులాబ్దిన్, అషియమ్మ
వృత్తి, ప్రావీణ్యం : ఏరోస్పేస్ ఇంజినీర్, సైంటిస్ట్{పొఫెసర్, రచయిత
వైవాహికస్థితి : అవివాహితులు
పురస్కారాలు : పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న

కలామ్ మాట - పువ్వుల బాట

శిఖరాగ్రం చేరుకోడానికి శక్తి కావాలి. అది ఎవరెస్ట్ శిఖరమైనా, జీవిత లక్ష్యం అయినా.

సృష్టికర్త మనలో అసాధారణమైన శక్తి సామర్థ్యాలను నిక్షిప్తం చేసి ఉంచాడు. దైవారాధనతో మనం వాటిని వెలికి తెప్పించుకుని ఉపయోగించుకోవాలి.


మానసిక దాస్యం నుంచి బయటికి రాలేకపోతే మనకెవరూ గౌరవం ఇవ్వరు. జీవితం కష్టమైన ఆట. జీవించే హక్కును కాపాడుకున్నప్పుడే అందులో గెలవగలం.


పైకి చూడండి. కింద మనమొక్కళ్లమే లేము. చుట్టూ మహా విశ్వమే ఉంది. అది స్నేహపూర్వకమైనది. ముఖ్యంగా - కలలు కనేవాళ్లకు, కష్టపడి పనిచేసేవారికి అన్నీ దగ్గరకి చేర్చిపెడుతుంది. కష్టాలు లేకపోతే విజయాలను పూర్తిగా ఆస్వాదించలేం. అనుకున్నది సాధించడానికి ఏకదీక్షగా లక్ష్యానికి అంకితమవ్వాలి.


సమస్య వస్తే బెంబేలు పడిపోకూడదు. మన నెత్తినెక్కి తొక్కే అవకాశం సమస్యకు ఇవ్వకూడదు.


జీవితానుభవం

1957లో కలామ్ మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. అది కష్టమైన సబ్జెక్టు. అందులో ఉన్న విద్యార్థులు మొత్తం కలామ్‌తో కలిపి తొమ్మిది మందే! ఫైనల్ ఇయర్‌లో ప్రొఫెసర్ శ్రీనివాసన్ వీళ్లందరినీ పిలిచి ఒక ప్రాజెక్టు పని అప్పగించారు. ఆరు నెలల్లో పూర్తి చెయ్యాలని గడువు విధించారు. ప్రాజెక్టు ఏమిటంటే - తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడి చెయ్యగల యుద్ధ విమానాన్ని డిజైన్ చెయ్యడం. ఏరో డైనమిక్స్, స్ట్రక్చర్స్, ప్రొపల్షన్, కంట్రోల్ ఇలాంటివన్నీ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లోని అంశాలు. వీటి ఆధారంగా విమానం నమూనాను రూపొందించాలి. కలామ్ ప్రాజెక్టు లీడర్. మిగతా ఎనిమిది మందీ సహాయక ఇంజినీర్లు. అంతా కలిసి నాలుగున్నర నెలల పాటు అధ్యయనం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు తప్ప ప్రాజెక్టు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.

ఓరోజు - ఈ టీమ్ మొత్తం లేబరేటరీలో ‘కుస్తీ పాట్లు’ పడుతోంది. అప్పట్లో కంప్యూటర్లు లేవు. డ్రాయింగ్ బోర్డు మీద కలామ్... విమానం డిజైన్‌ని గీస్తుంటే మిగతావాళ్లంతా ఆయన చుట్టూ నిలుచుని చూస్తున్నారు. ఫ్రొఫెసర్ శ్రీనివాసన్ సరాసరి వారి దగ్గరికి వచ్చారు.


‘‘ఫ్చ్. మీ వల్ల లాభం లేదు. నన్ను పూర్తిగా నిరాశ పరిచారు. రెండు వారాల్లో గనుక ప్రాజెక్టు పూర్తి కాకపోతే మీ స్కాలర్‌షిప్పులన్నిటినీ ఆపేస్తాను’’ అన్నారు.


ఆరోజుల్లోనే ఏరోనాటికల్ ఇంజినీరింగ్ క్లాస్టీ ఎడ్యుకేషన్. స్కాలర్‌షిప్ ఆపేస్తే ఇక ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోవలసిందే. కలామ్ బృందం ప్రొఫెసర్‌కు సారీ చెప్పింది. ఇంకొక్క అవకాశం ఇమ్మని అడిగింది. ఆయన వినలేదు. ‘కష్టపడి పనిచేస్తాం సార్, ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అన్నారు. ఆయన ఒప్పుకోలేదు. చివరికి తామేమిటో నిరూపించదలచుకున్నారు ఈ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు. రాత్రీ పగలు పనిచేసి, శని, ఆదివారాలు ల్యాబ్‌కు వచ్చి ప్రాజెక్టు మీద కూర్చున్నారు. హాస్టళ్లకు కూడా వెళ్లకుండా వర్క్ ిఫినిష్ చేశారు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ తయారైంది!


ఆ తర్వాతి ఆదివారం - గడువు తేదీకి ఒకరోజు ముందు - ప్రొఫెసర్ శ్రీనివాసన్ వీళ్ల దగ్గరకు వచ్చారు. డిజైన్ చూశారు. సంతోషించారు. అందర్నీ తన ఇంటికి తీసుకెళ్లి మెడ్రాస్ కాఫీ కాయించి ఇచ్చారు.


‘‘ఆ సంఘటన నాకు ప్రణాళిక తాలూకు ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. కాలం విలువను, టీమ్‌వర్క్ గొప్పతనాన్ని చెప్పింది. మనం చదువుతున్నది... మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్... ఏ ఇంజినీరింగ్ అయినా ప్రాక్టికాలిటీకి తేలిగ్గా అన్వయం అయేలా వాటిల్లోని మెళకువలు నేర్చుకోవాలి. ఇలాంటి విధానాన్ని మన విద్యావ్యవస్థ ప్రోత్సహించాలి’’అంటారు కలామ్.


థింకింగ్ హట్

రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ర్టపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో కలామ్ ఒక ఏకాంత కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. దానిని ఆయన ‘థింకింగ్ హట్’ అనేవారు. హట్‌లో సోఫాలుండేవి. వాటిపై కూర్చుని కలామ్ తన ఆలోచనల్ని అక్షరీకరించేవారు. ఆయన రాసిన పుస్తకాలలో రెండు ‘హట్’లో పుట్టినవే. కలామ్ పదవీకాలం ముగిసిన మూడేళ్లకు గార్డెన్‌ను పూర్వపు డిజైనింగ్‌కు అనుగుణంగా మార్పులు చేసేందుకు ఆ హట్‌ను తొలగించారు.

Jai Ho .............